Tuesday, November 26, 2024

ఎయిర్ జ‌ర్నీపై జ‌నాల ఇంట్రెస్ట్‌.. తిరుపతికి 77 శాతం పెరిగిన విమాన యానం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో విమాన ప్రయాణీకుల సంఖ్య భారీస్థాయిలో పెరుగుతూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణీకుల సంఖ్యతో ఈఏడాది ప్రయాణించినవారి సంఖ్యను పరిశీలిస్తే ఇది స్పష్టంగా అర్ధమౌతోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణికుల రద్దీ 77 శాతం పెరిగినట్లు- అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అన్నింటికన్నా తిరుపతి విమానాశ్రయానికి ప్రయాణీకుల సంఖ్య గణణీయంగా పెరిగింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అనేక విమానయాన సంస్థలు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. దీంతో కొత్త సర్వీసులతో విమానాశ్రయాలు కళకళ్లాడుతున్నాయి. ఈక్రమంలోనే కార్గో సేవలను కూడా విమానయాన సంస్థలు పెంచుతూ వస్తున్నాయి. తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు మినహా అన్ని విమానాశ్రయాల్లోనూ కార్గో సేవలు పెరుగుతూ వస్తుండటంతో విమానయాన సంస్థలు కార్గో సేవలను కూడా విస్తరిస్తున్నాయి.

పెరిగిన ప్రయాణీకుల సంఖ్య
2021-22లో 6.23 లక్షల మంది తిరుపతికి విమానంలో ప్రయాణించగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.52 లక్షల మంది మాత్రమే ప్రయాణించారు. అదేవిధంగా, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి గత ఏడాది 11.13 లక్షల రాకపోకలు సాగించగా ఈ ఏడాది 16.10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇది గత ఏడాదికంటే 45 శాతం అధికంగా ఉంది. ఇక విజయవాడ నుండి ఈ ఏడాది 6.25 లక్షల మంది ప్రయాణికులు తమ ప్రయాణాలు కొనసాగించగా గత ఏడాది 5.07 లక్షలమంది ప్రయాణించారు. అలాగే రాజమహేంద్రవరం విమానాశ్రయం నుండి గత ఏడాది 2.04 లక్షల మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను కొనసాగించగా ఈ ఏడాది 2.75 లక్షల మంది ప్రయాణించారు.

ప్రయాణీకులకు అనుగుణంగా పెరిగిన సర్వీసులు
ఇక ఈఏడాదిలో విశాఖపట్నంకు 14,852 విమానాలు రాకపోకలు కొనసాగించగా గత సంవత్సరం 10.671 సర్వీసులు రాకపోకలు కొనసాగించాయి. ఇది గత ఏడాదికంటే 28 శాతం అదనం. విజయవాడకు గత ఏడాది 7,423 విమాన సర్వీసులు కొనసాగగా, ఈఏడాది 9,528 విమాన సర్వీసులు నడిచాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 22 శాతం అధికంగా ఉంది. ఇక రాజమహేంద్రవరంకు గత ఏడాది 5,682 విమానాల రాకపోకలు సాగించగా, ఈ ఏడాది 7,019 రాకపోకలు కొనసాగించాయి. ఇది గత ఏడాది కంటే 19 శాతం అధికం. తిరుపతికి గత ఏడాది 4,612 విమానసర్వీసులు నడవగా ఈఏడాది 8,158 విమాన సర్వీసులు నడిచాయి. గత ఏడాదికంటే ఈ ఏడాది 43 శాతం అధికంగా నమోదయ్యాయి.

కార్గో సేవల్లోనూ ముందంజ
ఇదే క్రమంలో ఎయిర్‌ కార్గో కూడా పెరిగినట్లు- గణాంకాలు చెబుతున్నాయి. విశాఖపట్నం ఈ ఏడాదిలో 4,326 టన్నుల మేర సరకు రవాణా చేయగా, గత సంవత్సరం 3,778 టన్నులు మాత్రమే నమోదైంది. ఇక విజయవాడ నుండి గత ఏడాది 1,989 టన్నులు రవాణా చేయగా ఈ ఏడాది 2,264 టన్నులమేర రవాణా చేసింది. గత ఏడాది రాజమహేంద్రవరం మరియు తిరుపతిలో సరుకు రవాణా నమోదు కాలేదు. గత ఆర్థిక సంవత్సరంలో తిరుపతిలో 83 టన్నులు, రాజమహేంద్రవరంలో 9 టన్నులు రవాణా జరిగినట్లు-గా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈక్రమంలోనే ప్రయాణీకులు, సరకు రవాణా రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement