Sunday, November 24, 2024

హలీంకు జనం ఫిదా.. పాతబస్తీ నుంచి బంజారాహిల్స్ దాకా ఫుల్ బీజీ

హైదరాబాద్‌ ప్రతినిధి (ప్రభ న్యూస్‌): రంజాన్‌ మాసం ప్రారంభం కావడంతో పాత బస్తీ చార్మినార్‌ నుంచి మొదలుకుని సంపన్నులు నివసించే బంజారా హిల్స్‌, జూబ్లీహిల్స్‌ వరకు వాడ వాడలా వెలిసిన హలీం సెంటర్లతో హైదరాబాద్‌ నగరం సందడిగా తయారైంది. ఇక్కడ తయారు చేసే హలీంకు విదేశాల్లో సైతం డిమాండ్‌ ఉంది. ఇక్కడ నుంచి అరబ్‌ దేశాలతో పాటు పలు విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఉపవాస దీక్ష చేసేవారి ఆహారంగా గుర్తింపు పొందడంతో మొదట్లో ముస్లిం సోదరులే ఎక్కవగా తినేవారు. మాంసంతో పాటు అనేక రకాల పప్పుదినుసులతో తయారు చేయడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. హలీం బలమైన పోషకాలతో కూడిన ఆహారమని శాస్త్రీయంగా నిరూపించబడటంతో ముస్లిం సోదరులతో పాటు హిందువులు, క్రైస్తవులు తదితర అన్ని మతాలకు చెందిన ప్రజలు ఇష్టాంగా తింటున్నారు. సాయంత్రమైందటే నగరంలోని హలీం సెంటర్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ప్లేట్‌, ఫుల్‌, ఫ్యామిలీ ప్యాక్‌ వరకు రూ.50 నుంచి రూ.1,000 వరకు ప్రాంతాలను బట్టి లభిస్తోంది.

తయారీ ప్రత్యేకం..

మాంసాహారంతో తయారు చేసే వంటకాలతో పోలిస్తే హలీం తయారీ ప్రత్యేకమని చెప్పవచ్చు. దీని తయారికి కనీసం 9 గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్‌ లేదా చికెన్‌, గోధుమలు, అన్ని పప్పులు, బాస్మతిబియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫ్రూట్స్‌ తదితర వస్తువులను వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాస్మతిబియ్యం, పప్పులు, అల్లంవెల్లుల్లిపేస్ట్‌, మసాలాదినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. సమ పాళ్లలో నెయ్యి కలుపుతారు. వడ్డించేటప్పుడు వేడివేడిగా వేయించిన ఉల్లిపాయలు, నిమ్మముక్కలను వేస్తారు..

విదేశాలకు ఎగుమతి..

హలీం వంటకం అరబ్‌ దేశమైన పర్షియా నుంచి హైదరాబాదుకు దిగుమతి అయింది. ఆరో నిజాం నవాబు మహబూబ్‌ అలీఖాన్‌ ఈ వంటకాన్ని నగర ప్రజలకు పరిచయం చేశారు. ఎక్కడ నుంచి దిగుమతి అయిందో తిరిగి అక్కడికే ఎగుమతి అవుతోంది. నగరానికి చెందిన పిస్తా హౌజ్‌, బావార్చి, 555, కేఫే బాహర్‌ లాంటి ప్రముఖ హోటళ్ల నుంచి సౌది అరేబియా, కువైట్‌, మలేషియా, సింగపూర్‌ లాంటి అనేక దేశాలకు విమానాల ద్వారా పంపిస్తున్నారు. అక్కడి ప్రజలకు ఆన్‌ లైన్‌లో బుక్‌ చేసుకుంటే ప్రత్యేక ప్యాకేజీలో విదేశీ వినియోగ దారులకు అందిస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement