హైదరాబాద్‌లో ట్రెండ్ మారుతోంది. బిజీ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్ కోరుకునే వారు సిటీలోని లేక్ వ్యూ ఏరియాలకు తరలివస్తున్నారు. చల్లని సాయంత్రాలను, అక్కడి ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది అయితే.. రాత్రివేళ కుటుంబంతో సహా తరలివచ్చి అక్కడ సరదాగా గడుపుతున్నారు. ఇక.. లవర్స్‌కి మరో రొమాంటిక్ ప్లేసెస్‌గా ఈ లేక్ ఏరియాలు మారిపోతున్నాయి. జనాల ఇంట్రెస్ట్‌ని, వారి అవసరాలను ఆసరాగా కొంతమంది లేక్ ప్రాంతాల్లో ఫుడ్ బిజినెస్ ప్రారంభిస్తున్నారు. ఇలా వారికి ఉపాధి, అటు సరదగా వచ్చేవారికి టేస్టీ ఫుడ్ దొరుకుతోంది..
– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ
హైదరాబాద్ అంటేనే ఓ ప్రత్యేకత.. ఈ మహానగరం ఎక్కడెక్కడి నుంచో పొట్ట చేతపట్టుకుని వచ్చిన నిరుపేదలను అక్కున చేర్చుకుని ఆసరాగా నిలిస్తే.. బడా బాబుల రుబాబునూ చూపించుకునే వెసలుబాటునూ కల్పిస్తోంది. ఇక్కడ అయిదు రూపాయలకు పొట్ట నింపుకునే అవకాశం ఉంటే.. ధన వంతుల పిల్లలు పూట పూటకూ వేలాది రూపాయలు ధారపోసి ఎంజాయ్ చేసే సౌలత్ ఉంది.. అట్లనే, ఈ మధ్య సిటీ మధ్యలో ఉండే చెరువులను ప్రభుత్వం డెవలప్ చేయడంతో దాని చుట్టుపక్కల ఫుడ్ కోర్టులు, ఆహారపు బండ్లు, టిఫిన్ సెంటర్లు వెలిశాయి. దీంతో ఉపాధి వేటకు వచ్చే వారు, చల్లని సాయంత్రాలను ఎంజాయ్ చేసేవారూ ఇక్కడి ఫుడ్ టేస్ట్‌కి ఫిదా అవుతున్నారు. చెరువు అందాలను, సాయంసంధ్య వేళ సూరీడి సోయగాలను చూసి మురిసిపోతున్నారు. ఇక రాత్రివేళ కూడా నిలువ నీడ లేనివారేమో ఫుట్‌పాత్‌లపై సేదతీరుతుంటే, కొంతమంది డాబుసరి చూపించుకోవడానికి పెద్ద పెద్ద కార్లలో వచ్చి దర్జాపోతుంటారు. ఇట్లాంటి మరెన్ని విశేషాలను ఈ మహానగరం తన కౌగిలిలో బంధించింది. మరే నగరానికి లేని ప్రత్యేకతను సంతరించుకుని మురిసిపోతోంది. విశ్వనగరమై విలసిల్లుతోంది.
ఫుండ్ బిజినెస్ రంగంలో హైదరాబాద్ రోజు రోజుకూ డెవలప్ అవుతోంది. కేవలం కేఫ్‌లు, రెస్టారెంట్లు మాత్రమే కాకుండా సిటీలోని స్ట్రీట్ ఫుడ్ జోన్లు కూడా ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. కొన్ని సంవత్సరాల క్రితంతో పోలిస్తే హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ అనేది చాలామందికి ఉపాధిగా మారింది. ఇట్లాంటి ప్రదేశాలు సిటీలో చాలా ఉన్నాయి. నగరం చుట్టూ అనేక ప్రదేశాల్లో ఫుడ్ బిజినెస్ చేసుకునే వెసలుబాటు దొరికింది. ఇక్కడ విక్రేతలు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేసి, వినియోగదారులకు నోరూరించేలా ఎంతో టేస్టీగల ఫుడ్‌ని అందిస్తున్నారు.
మరో ఆసక్తికరమైన ట్రెండ్ ఏంటంటే.. సిటీలోని చాలా సరస్సుల చుట్టూ ఈ స్ట్రీట్ ఫుడ్ జోన్లు ఏర్పాటయ్యాయి. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రభుత్వం సరస్సులు, వాటి పరిసరాల ప్రాంతాలను డెవలప్ చేసింది. దీనికి ప్రత్యేకంగా ఓ మిషన్‌ను చేపట్టింది. దీంతో నగరవాసులకు ఇప్పుడు లేక్ వ్యూ అందాలతోపాటు.. వాకింగ్ చేస్తూ పరిసరాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక.. అక్కడి స్టాల్స్ దగ్గర రుచికరమైన ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నారు.
మల్కం చెరువు..
సిటీలోని పశ్చిమ ప్రాంతంలో ఈ మధ్యనే మల్కం చెరువును ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇక్కడ కొన్ని రెస్టారెంట్లు ఏర్పాటు కావడమే కాకుండా, కబాబ్‌లు, బొంగులో చికెన్ బిర్యానీ, ఐస్ క్రీం వంటి ఇతర ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇట్లా మినీ స్ట్రీట్ ఫుడ్ లేన్ ఈ ఏరియాలో ఉండడంతో చాలామంది ఈ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. ఇక.. సరస్సు చుట్టూ వాకింగ్ ట్రాక్‌తో పాటు పిల్లల కోసం చిన్న రైడ్లు, స్వింగ్‌లు ఉండే పార్కు కూడా ఉంది. ఈ పార్కుని సందర్శించడానికి బెటర్ టైమ్.. చల్లని సాయంత్రాలతో పాటు.. రాత్రివేళ కూడా ఎంతో బాగుంటుంది.
దుర్గం చెరువు..
హైదరాబాద్‌కి మరో ఐకానిక్ గా మారింది కేబుల్ బ్రిడ్జి. ఈ తీగల వంతెన మీదుగా ప్రయాణించిన తర్వాత.. సరస్సు, దాని చుట్టుపక్కల అనేక ఫుడ్ ట్రక్కులు కనిపిస్తాయి. ఇక్కడ దోసె, పునుగులు, ఇతర ఫేమస్ సౌత్ ఇండియన్ డిషెష్, టిఫిన్లతో పాటు చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే.. దోస అని చెప్పావచ్చు. ఈ సరస్సు వద్ద స్పీడ్ బోటింగ్, పెడిల్ బోటింగ్‌ని కూడా ఎంజాయ్ చేయవచ్చు. కేబుల్ బ్రిడ్జిని, దానికి అమర్చిన అద్భుతమైన లైట్లను చూడాలంటే మాత్రం సూర్యుడు అస్తమించే దాకా వెయిట్ చేయాల్సిందే.
ఖాజాగూడ సరస్సు..
కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఖాజాగూడ హైకింగ్, సూర్యోదయానికి ఒక ప్రదేశం. కానీ నేడు, ప్రతి సాయంత్రం ఈ సరస్సు చుట్టుపక్కల ప్రాంతం ఒక అద్భుతమైన స్ట్రీట్ ఫుడ్‌కి స్వర్ఘధామంగా మారిపోయింది. సూర్యాస్తమయాన్ని వీక్షిస్తూ సందర్శకులు ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్‌ని ఆస్వాదించవచ్చు. ఎందుకంటే రోజూ సాయంత్రం అనేక మంది విక్రేతలు ఈ ప్రాంతానికి తరలివస్తారు. పిజ్జా, మోమోస్ తోపాటు బర్గర్లు.. ఐస్ క్రీం వరకు ఇక్కడ చాలా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ అంటే హుస్సేన్ సాగర్ అని చాలామందికి తెలుసు. ఇప్పటికీ క్లాసిక్ స్ట్రీట్ స్టైల్‌ని ఆస్వాదించగల అనేకమందికి ఇదో గుడ్ ప్లేస్‌గా చెప్పవచ్చు.