Sunday, November 24, 2024

Peddapalli – క్యాంపెయిన్​ డీలా… లోక్​​సభ ఎన్నికల్లో కానరాని మైకుల మోత

లోక్​​సభ ఎన్నికల్లో చప్పిడిగా ప్రచారం
కానరాని మైకుల మోత
కనిపించని పార్టీ శ్రేణుల హడావిడి
సన్నాహక సమావేశాల్లో కాంగ్రెస్
రైతు సమస్యలపై బారాస ఫోకస్
బీజేపీ అభ్యర్థిని మారుస్తారని చర్చ
శ్రీధర్ బాబు పైనే వంశీ గెలుపు భారం

పెద్దపల్లి (ఆంధ్రప్రభ) ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పండగ వాతావరణం కనిపిస్తుంది. సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకుల గోలలతో పట్టణాలు, పల్లెలు హెరెత్తుతాయి. నాయకుల మాటలు, హామీలతో ఆ ధూంధాం వేరే ఉంటుంది. పార్టీ జెండాలు పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థులు పడే పాట్లు మామూలుగా ఉండవు.

- Advertisement -

ఇవన్నీ ప్రతి ఎన్నికల వేళ కనిపించే చిత్రాలు. గత నవంబర్‌లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి హంగామే చూశాం. కానీ లోక్​సభ ఎన్నకల్లో మాత్రం ఆ హడావిడి కనిపించడం లేదు. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినా వారి ప్రచారం అసలే కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థులు వారి వారి ముఖ్య నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని గెలుపు కోసం చర్చించుకుంటున్నారు. తూతూమంత్రంగా సమ్మేళనాలు నిర్వహించుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటి నుంచి ప్రచారంలోకి దిగితే ఖర్చు తడిసి మోపెడవుతుందని అభ్యర్థులు వణికి పోతున్నారు. ప్రచారాలు కాన రాకపోవడంతో జనం ఒకంత విస్మయానికి గురవుతున్నారు. పెద్దపల్లి లోక్​సభ స్థానానికి మొట్టమొదట బీఆర్ఎస్​ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను అధినేత కేసీఆర్ ప్రకటించారు. బీఆర్​ఎస్​ నుంచి వలస వచ్చిన గోమాస శ్రీనివాస్ కు బీజేపీ టికెట్ కేటాయించింది. ఎన్నో పేర్లు ప్రచారంలోకి వచ్చినా ఎంతో ఉత్కంఠ అనంతరం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా కాకా మనవడు గడ్డం వంశీకృష్ణను ప్రకటించింది.

కాంగ్రెస్ సన్నాహక సమావేశాలు

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను ప్రకటించినా అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంతో కొంత సమయం గడిచిపోయింది. వంశి అభ్యర్థిత్వాన్ని లోక్​సభ పరిధిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా అధిష్టానం టికెట్ కేటాయించడంతో వారు మౌనంగా ఉండిపోయారు. లోక్​సభ ఇన్‌చార్జి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చొరవ తీసుకోవడంతో నియోజకవర్గ ​సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక తాటిపైకి వచ్చారు. హైదరాబాద్‌లోని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు సమావేశమై వంశీకి మద్దతు ప్రకటించారు. వంశీకృష్ణ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలందరూ ఏకతాటి పైకి రావడంతో మంచిర్యాల, రామగుండం, మంథని, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ముఖ్య నేతలతో సన్నాహక సమావేశాలు వంశీకి మద్దతుగా నిర్వహించారు. ఈ సమావేశాల్లో లోక్​సభ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం కోసం కార్యకర్తలు కష్టపడి నెలరోజులపాటు పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం వంశీకృష్ణకు కలిసి వచ్చే అంశం. మంత్రి శ్రీధర్ బాబు లోక్​సభ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉండడం, ఎమ్మెల్యేలందరినీ బుజ్జగించి వంశీకి మద్దతుగా ప్రచారం ప్రారంభించడంతో పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

రైతు సమస్యలపై బీఆర్​ఎస్​

పెద్దపల్లి లోక్​సభ స్థానానికి బీఆర్​ఎస్​ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను అందరికంటే ముందుగా ప్రకటించినా ఆయన ఓటర్ల వద్దకు వెళ్లడం ప్రారంభించలేదు. అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రైతు సమస్యలపై పలు దీక్షలు చేపట్టారు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు లోక్​సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముఖ్య నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో కలిసి పని చేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 36 గంటల రైతు దీక్ష నిర్వహించారు. పూర్తిగా ముఖ్య నాయకుల వరకే సమావేశాలు పరిమితం కావడంతో కిందిస్థాయి నాయకులు, శ్రేణులు ఒకింత నిరాశలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో పూర్తి గా డీలాపడిన గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంలో ఇప్పటివరకు కారు పార్టీ నాయకులు చర్యలు చేపట్టలేదనే చెప్పాలి. అంతర్గత సమావేశాలు మాని జనంలోకి వచ్చి ప్రచారం నిర్వహించాలని బారాసా శ్రేణులే చర్చించుకుంటున్నారు. ఈ నెల 19న బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్దపల్లి పర్యటన ఖరారైంది. కేటీఆర్ పర్యటన అనంతరం గులాబీ పార్టీ ప్రచారం జోరు అందుకుంటుందో వేచి చూడాలి.

బీజేపీ లో సఖ్యత కరువు

కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిగా బీఆర్​ఎస్​ నుంచి పార్టీలో చేరిన గోమాస శ్రీనివాస్‌ను ప్రకటించింది. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొన్ని సమావేశాలు, కార్యక్రమాల్లో అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పాల్గొని బీజేపీ గెలుపు కోసం పని చేయాలని శ్రేణులను కోరుతున్నారు. వ్యాపారులను కలుస్తూ కమలం పువ్వు గుర్తుపై ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. అయితే బీజేపీ ముఖ్య నేతల్లో ఉన్న అంతర్గత విభేదాల కారణంగా ప్రచార హోరు కానరావడం లేదు. భాజపా నిరసన దీక్షలు గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయులు ఒకచోట, దుగ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయులు ఒకచోట నిర్వహించడమే అంతర్గత కుమ్ములాటలను బహిర్గతం చేస్తుంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని కాషాయ పార్టీ ముఖ్య నేతలు ఉండడంతో ఆ పార్టీకి నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. భాజపా అభ్యర్థి పై అసెంబ్లీ నియోజకవర్గం నేతలు అసంతృప్తి ఉండడంతో ఇతర ప్రాంతాల కంటే పెద్దపల్లిలో భాజపా వెనుకబడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ అభ్యర్థిని మారుస్తారని ప్రచారం

పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిని మారుస్తారని నియోజకవర్గ పరిధిలో జోరుగా చర్చ నడుస్తుంది. అధిష్టానం ప్రకటించిన బీజేపీ అభ్యర్థి గోమాస వెనుకబడిపోయారని అధిష్టానానికి సమాచారం ఉండడంతో అతన్ని మారుస్తారని బీజేపీ శ్రేణుల్లో చ‌ర్చ‌ జరుగుతుంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ వెంకటేష్‌కు టికెట్ ఇస్తారని ప్రచారం ఊపందుకుంది.

శ్రీధర్ బాబు పైనే భారం

కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు బాధ్యత రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తన భుజాలపై వేసుకున్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా, లోక్​సభ ఇన్‌చార్జిగా, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ గెలుపును ఆయన చాలెంజిగా తీసుకున్నారు. లోక్​సభ పరిధిలోని ఎమ్మెల్యేలు అందరినీ ఏకతాటిపైకి తేవడంలో మంత్రి సఫలీకృతులయ్యారు. టికెట్ ఆశించిన వారిని సైతం బుజ్జగించారు. వారం రోజులుగా లోక్​సభ పరిధిలో సన్నాహ‌క సమావేశాలు నిర్వహిస్తూ వంశీకి మద్దతు ఇవ్వాలని శ్రేణులను కోరుతూ కాంగ్రెస్ గెలిస్తేనే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని వివరిస్తున్నారు. యువకుడైన వంశీ గెలిస్తే ఈ ప్రాంతంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని హామీ ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మంత్రి వంశీ గెలుపు బాధ్యతలు తీసుకోవడంతో పెద్దపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement