స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 0-3తేడాతో పాకిస్థాన్ జట్టు ఓడిపోవడంతో ..పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రాజాను ఆ పదవిని నుంచి పాక్ ప్రభుత్వం తొలగించింది. స్వదేశంలో వరుస ఓటములు, ఇంగ్లండ్ సిరీస్ లో పిచ్ ల తయారీపై ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఉద్వాసన పలికినట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేరిట వెలువడిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పాక్ ప్రధాని పీసీబీకి ప్యాట్రన్ ఇన్ ఛీఫ్ గా కూడా వ్యవహరిస్తారు.
మరోవైపు రమీజ్ రాజా స్థానంలో కొత్త ఛైర్మన్ గా నజీమ్ సేథీని ఎంపిక చేశారు. రానున్న నాలుగు నెలల పాటు నజీమ్ సేథీ నేతృత్వంలోని 14 మంది సభ్యుల కమిటీ పాక్ క్రికెట్ కార్యకలాపాలను చూసుకుంటుంది. పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా 15 నెలల పాటు పీసీబీ ఛైర్మన్ గా వ్యవహరించారు. పీసీబీ ఛైర్మన్ గా వ్యవహరించిన నాలుగో క్రికెటర్ రమీజ్ రాజా. అంతకు ముందు అబ్దుల్ హఫీజ్ కర్దార్ (1972-77), జావెద్ బుర్కీ (1994-95), ఇజాజ్ భట్ (2008-11)లు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వహించారు. మరోవైపు పీసీబీ సీఈవోగా 2013 నుంచి 2018 వరకు సేథీ సేవలందించారు. అయితే, 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు.