విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు సంఘీభావంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ నాయకులు దీక్షకు కూర్చున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై ఏపీ సీఎం జగన్ స్పందించాలనే డిమాండ్ తోపాటు కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ దీక్షకు దిగారు. తొలుత తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన.. అమర వీరులకు నివాళులు అర్పించిన అనంతరం పవన్ కళ్యాణ్ దీక్షను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
దీక్షలో జనసేన ముఖ్య నేత నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. రైతు చట్టాల విషయంలో వెనక్కి తగ్గిన కేంద్రం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.