పవర్‌స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల కరోనా బారిన పడిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి కరోనా నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. అందులో ఆయనకు రిపోర్ట్ నెగటివ్ వచ్చినట్లు సమాచారం. మూడ్రోజుల కిందట పవన్ కళ్యాణ్‌కి అస్వస్థతగా అనిపించడంతో టెస్టు చేయించుకున్నారు. అందులో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో హైదరాబాద్ దగ్గర్లోని తన వ్యవసాయక్షేత్రంలో డాక్టర్ల సమక్షంలో చికిత్స తీసుకున్నారు. జ్వరంతోపాటు ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందని డాక్టర్లు తెలిపారు. ఆయనకు యాంటీ వైరల్ డ్రగ్స్, అవసరమైనప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.
పవన్ కోవిడ్ బారినపడ్డారనే వార్త తెలియగానే ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు చేశారు. తమ అభిమాన నటుడు ఆరోగ్యంగా ఉండాలంటూ ఫ్యాన్స్ పూజలు చేశారు. ఎట్టకేలకు వారి పూజలు ఫలించాయి.. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పవన్ కళ్యాణ్‌కు నెగిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు.