Tuesday, November 26, 2024

మోడీకి హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్

గ‌త పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఆమోదం పొందిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ఉపసంహ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రైతుల శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ చ‌ట్టాలు రైతుల ఆమోదం పొంద‌క‌పోవ‌డంతో రానున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఈ చ‌ట్టాలను ఉప‌సంహరిస్తామ‌ని మోడీ ప్ర‌క‌టించ‌డం ఆయ‌న‌లోని రాజ‌నీతిజ్ఞ‌త‌ను తెలుపుతోంద‌న్నారు. ఈ ప‌రిణామం హ‌ర్ష‌ణీయమ‌న్నారు. గురునాన‌క్ జ‌యంతి సంద‌ర్భంగా మోడీ చేసిన ప్ర‌సంగాన్ని ఆద్యంతం ప‌రిశీలిస్తే జ‌న‌వాక్కును శిరోధార్యంగా భావించిన‌ట్లుగా మ‌న‌కు అవ‌గ‌త‌మ‌వుతుంద‌న్నారు.

ఏడాదిగా రైతులు చేసిన పోరాటానికి ఒక ఫ‌ల‌ప్ర‌ద‌మైన ముగింపు ఆవిష్కృతం కావ‌డం ఒక శుభ‌ప‌రిణామ‌మ‌న్నారు. ఎండ‌న‌కా, వాన‌న‌కా, ఏడాదిపాటు ఈ ఉద్య‌మాన్ని న‌డిపి, చివ‌రికి సుప్రీంకోర్టుకు వెళ్లిన రైతులు, రైతు నాయ‌కుల‌కు మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు తెలుపుతున్నాన‌న్నారు. పోరాటం చేస్తే సాధించ‌లేనిది ఏదీ లేద‌ని రైతుల ఉద్య‌మం మ‌రోసారి నిరూపించింద‌న్నారు. రైతుల పోరాటాన్ని రాజ‌కీయ దృక్కోణంతో కాకుండా ఒక సామాజిక అంశంగా భావించి చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించ‌డానికి సుముఖ‌త చూపిన భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌క‌త్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement