Tuesday, November 26, 2024

Pawan Kalyan: భాకరాపేట ప్రమాదం శోచనీయం.. జనసేన అధినేత పవన్ విచారం

ఎంతో సంతోషంతో నిశ్చితార్థం వేడుకలకు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుచానూరుకు వెళుతున్న బృందం ప్రమాదానికి గురై ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోవడం, మరో 54 మంది తీవ్రంగా గాయపడడం మనసును తీవ్రంగా కలచి వేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళకరంగా ఉండడం మరింత విషాదకరం అని పేర్కొన్నారు. నిన్నటి రాత్రిvవేళ చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డులో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు లోయలోకి బోల్తా కొట్టి ప్రమాదం సంభవించగా చాలా సేపటి వరకు ఈ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేదని తెలిసి భాద అనిపించిందని అన్నారు. ఆ సమయంలో సహాయం అందక క్షతగాత్రులు ఎంత వేదన అనుభవించారో ఊహిస్తేనే గుండె భారంగా మారుతోందని చెప్పారు.

బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారని తెలిపారు. ఇది దురదృష్టకరం అని అన్నారు. ఇటువంటి బస్సుల యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి లేనిపక్షంలో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. బస్సులకు స్పీడ్ కంట్రోల్స్ ను తక్షణం అమర్చే చర్యలు చేపట్టాలని సూచించారు. ఘాట్ రోడ్లలో రక్షణ గోడలను పటిష్టపరచాలన్న పవన్.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి తగినంత నష్టపరిహారాన్ని రాష్ట్రప్రభుత్వం అందివ్వాలని డిమాండ్ చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ప్రమాదంలో అశువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని తెలిపారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని పవన్ కల్యాణ్ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement