Wednesday, November 20, 2024

ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడిగా పశుపతి ఏకగ్రీవ ఎన్నిక

బీహార్‌లో లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి)లో బాబాయి – అబ్బాయి మధ్య వార్‌ కొనసాగుతోంది. లోక్‌ జనశక్తి (ఎల్‌జెపి) జాతీయ అధ్యక్షుడిగా ఎంపీ చిరాగ్ పాశ్వాన్ బాబాయ్ పశుపతి పారస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాట్నాలో జరిగిన పార్టీ జాతీయ కార్యనిర్వాహకవర్గ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పశుపతి పారస్ ఎన్నికను చిరాగ్ పాశ్వాన్ తిరస్కరించారు. జాతీయ కార్య నిర్వాహక వర్గం భేటీ రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆదేశాలతోనే పశుపతి వర్గం పార్టీలో తిరుగుబాటు చేసిందని ఆరోపించారు. పార్టీ అసలైన కార్య నిర్వాహక వర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరుగుతుందన్నారు.  మరోవైపు పశుపతి పారస్‌కు వ్యతిరేకంగా పాట్నాలోని పలు ప్రాంతాల్లో చిరాగ్ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

ఎల్జేపీ సభాపక్షనేతగా తన చిన్నాన్న పశుపతి కుమార్‌ పారిస్‌ను గుర్తించడాన్ని వ్యతిరేకిస్తూ.. చిరాగ్‌ పాశ్వాన్‌ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఇప్పటికే లేఖ రాశారు. ఇది తమ పార్టీ నిబంధనలకు వ్యతిరేకమని ఆయన అన్నారు. అసలు తమ పార్టీ నుంచి ఎవరు సభాపక్షనేతగా ఉండాలనేది.. రాజ్యాంగంలోని 26వ అధికరణం ప్రకారం సెంట్రల్‌ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి అయిదుగురు ఎంపీలను బహిష్కరించినట్టు తెలిపారు. ఈ కుట్రలకు నితీష్‌ కుమార్‌ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇలాంటి కుట్రలు తన తండ్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ బతికి ఉన్నప్పుడే జరిగాయని గుర్తు చేశారు. అయితే ఇలాంటి కుట్రలకు వ్యతిరేకంగా తాను పోరాడతానని స్పష్టం చేశారు. ఇదంతా కూడా.. తన ఆరోగ్యం బాగులేని సమయంలోనే జరిగిందని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: విశాఖలో పీవీ సింధు అకాడమీకి 2 ఎకరాల భూమి

Advertisement

తాజా వార్తలు

Advertisement