నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే, అన్ని పార్టీలకు కోవర్డుల భయం వెంటాడుతోంది. సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు.. గెలుపు కోసం సర్వశత్తులొడ్డుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు కూడా పార్టీ అభ్యర్థి నోముల భగత్ తరుపున ప్రచారం చేస్తున్నారు. అయితే.. సొంత లీడర్లు హ్యాండ్ ఇస్తారన్న భయం టీఆర్ఎస్లో కనిపిస్తోంది. పార్టీలో కోవర్టులు ఉన్నట్టు, పార్టీకి వ్యతిరేకంగా పని చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెడ్డి లీడర్లంతా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని గెలిపించేందుకు అంతర్గతంగా ఏకమైనట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎస్సీ, ఎస్టీలను సమీకరించే పనిని కూడా రెడ్డి లీడర్లే తీసుకున్నట్లు సమాచారం. యాదవ, ఇతర బీసీ కులాలను ఎట్లా సమీకరించాలనే అంశంపైనా వీళ్లు దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచార బాధ్యతలను సొంత జిల్లా నేతలకు ఇవ్వకుండా ఇతర లీడర్లకు ఇవ్వడం నెగెటివ్ అవుతుందని టీఆర్ఎస్ స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. రెడ్డి కుల సమీకరణను టీఆర్ఎస్ హైకమాండ్ గమనించినట్లు కనిపిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ లోనూ కోవర్డుల భయం నెలకొంది. పార్టీలోని కొందరు నేతలు టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగోతంది. పార్టీ వ్యూహాలను గులాబీ నేతలకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ముఖ్య అనుచరుడి ఇంట్లో రూ.40 లక్షలు విలువ చేసే మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది కోవర్టుల పనేనని కాంగ్రెస్ అనుమానిస్తోంది.
నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్… డబ్బులు పంచి గెలవాలని చూస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేస్తోందని అంటున్నారు. ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని, పోలీసులు కూడా ఏకపక్షంగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో జోష్ మీద ఉన్న బీజేపీ.. సాగర్ బై ఎలక్షన్పైనా ఆశలు పెట్టుకుంది. పార్టీ ఓటు బ్యాంకు లేని నియోజకవర్గం కావటంతో పార్టీలు నేతలు విసృత్త ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవతిరేకత తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. జనరల్ సీటు అయిన సాగర్ నియోజకవర్గంలో గిరిజన(లంబాడా) కులానికి చెందిన రవినాయక్ ను బరిలోకి దింపి.. గిరిజనుల ఓట్లపై ఆశలు పెట్టుకుంది.