Friday, November 22, 2024

ఫార్మాసిటీలో భాగస్వామ్యమవండి.. స్క్రిప్స్‌ పరిశోధన సంస్థకు కేటీఆర్‌ ఆహ్వానం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్‌ ఫార్మాసిటీలోని ఫార్మా యూనివర్సిటీలో భాగం కావాలని ప్రఖ్యాత పరిశోధన సంస్థ స్క్రిప్స్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. పాఠ్యాంశాల రూపకల్పన, బోధనా సిబ్బంది, విద్యార్థుల మార్పిడి, జాయింట్‌ రీసెర్చ్‌, జాయింట్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ల రూపకల్పనలో స్క్రిప్స్‌ తన భాగస్వామ్యాన్ని అందించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం శాండియాగోలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌, స్క్రిప్స్‌ పరిపాలక సభ్యులైన డా. జేమ్స్‌ విలియమ్సన్‌ ,మేరీవాంగ్‌, డాక్టర్‌. అర్నాబ్‌ ఛటర్జీ, ప్రొఫెసర్‌ సుమిత్‌ చందాలతో సమావేశమయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తున్న ఫార్మాసిటీ వివరాలను వారితో కేటీఆర్‌ పంచుకున్నారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌లో ఉన్న అపార అవకాశాలను వివరించారు. ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు ఏర్పాటుచేయడం, ఫార్మా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను కేటీఆర్‌ చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని అనుకూలతలు ఒక్క తెలంగాణకు మాత్రమే ఉన్నాయని కేటీఆర్ స్క్రిప్స్‌ బృందానికి తెలిపారు.

స్క్రిప్స్‌ పరిశోధన సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్న భాగస్వామ్య విధానంపై చర్చించారు. మంత్రి కేటీఆర్‌ ప్రజెంటేషన్‌పై స్క్రిప్స్‌ బృందం ఆసక్తి కనబర్చింది. తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్న భాగస్వామ్యంపై త్వరలోనే చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామి ఇచ్చింది. ఆధునిక సైన్స్‌ పరిశోధనల్లో దూసుకుపోతున్న స్క్రిప్స్‌ సంస్థ విజయగాథను అధ్యయనం చేసేందుకు స్క్రిప్స్‌ రీసెర్చ్‌ టీమ్‌, తెలంగాణ ప్రభుత్వంతో ఒక వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటుచేయాలని ఈ సమావేశంలో ప్రతిపాదించారు.

స్క్రిప్స్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన పరిశోధన సంస్థ
సైన్స్‌ పరిశోధనల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సంస్థగా స్క్రిప్స్‌ రీసెర్చ్‌కు పేరుంది. 2,400 మంది శాస్త్రవేత్తలు, సిబ్బందితో పాటు 200 కంటే ఎక్కువ ప్రయోగశాలలు ఈ సంస్థకు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్‌, లాభాపేక్షలేని బయోమెడికల్‌ పరిశోధన సంస్థ చేస్తోంది. ఈ సంస్థకు చెందిన ఐదుగురికి ప్రఖ్యాత నోబెల్‌ బ#హుమతులు వచ్చాయి. స్క్రిప్స్‌ సంస్థకు దాదాపు 1,100 పేటెంట్లు ఉన్నాయి. ఆమోదిత 10 చికిత్సా విధానాలను కనుగొనడంతో పాటు 50కి పైగా స్పిన్‌ఆఫ్‌ కంపెనీలను స్క్రిప్స్‌ ఏర్పాటుచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement