ఓరుగల్లు మహా నగరంను ట్రాఫిక్ సమస్యతో పాటు పార్కింగ్ సమస్య వేధిస్తోంది. పెరుగుతున్న జనాభా, తదనుగుణంగా వాహనాల సంఖ్య కనుగుణంగా నగరంలోని రోడ్లు విస్తరించకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి తోడు పార్కింగ్ సమస్య పెద్ద గుదిబండగా మారింది. ఇప్పటికే నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, మరణాల రేటును తగ్గించేందుకు వరంగల్ పోలీస్ బాస్ డా.తరుణ్ జోషి నడుం బిగించారు. అదే తరహాలో పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపడంపై దృష్టి సారించారు. వరంగల్ నగరంలోని వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా పార్కింగ్ జోన్స్ ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించారు.
షాపింగ్ మాల్స్, మెయిన్ రోడ్స్ పై వాహనాలను ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా నిలుపుతూ, ట్రాఫిక్ కష్టాలు తెచ్చి పెడుతున్నారు. హైదరాబాద్ మహా నగరం తర్వాత అతి పెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్ లో ట్రాఫిక్ కష్టాలు, పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం పెరిగిపోయింది. ఈ విషయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పరెడ్డి లు గుర్తించారు. ట్రాఫిక్ ఏసీపీ బాలస్వామి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ సమస్య పరిష్కారానికై కసరత్తు చేయాలని ఆదేశించారు.
రంగంలోకి దిగిన అధికారులు :
ఓరుగల్లు నగరంను వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటు కోసమై వరంగల్ ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులను పరిశీలించారు. ట్రాఫిక్ ఏసీపీ బాలస్వామి, కాజీపేట ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ నోముల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అంబెడ్కర్ జంక్షన్ నుండి అదాలత్ కూడలి, కలెక్టరేట్ బంగ్లా, సుబేధారి, ఫాతిమా నగర్ జంక్షన్స్ తో పాటు కాజీపేట సెంటర్ పాయింట్, కడిపికొండ, ఫాతిమనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద నిత్యం తలెత్తున్న ట్రాఫిక్ కష్టాలు, ఇబ్బందులు, పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు గల అవకాశాలపై అధ్యయనం చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని రెండు కలెక్టరేట్లు, కలెక్టర్ బంగ్లాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం, అదీగాక హన్మకొండ ప్రాంతం శరవేగంగా విస్తరించడం వల్ల జనాభా పెరగడమే కాక, వాహనాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోవడం వల్ల ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు ఉత్పన్న మయ్యాయి. ఇవి చాలవన్నట్టుగా ట్రాఫిక్ రూల్స్ పై వాహన చొదకులకు సరైన అవగాహన లేకపోవడంతో వెహికిల్స్ ను ఎక్కడపడితే అక్కడ నిలుపుతుండటం వల్ల ట్రాఫిక్ సమస్య జఠిలంగా తయారైంది. హన్మకొండ, కాజీపేట మెయిన్ రోడ్డు కావడం వల్ల వాహనాల రద్దీ కూడ ఎక్కువగా ఉండటం వల్ల ట్రాఫిక్ ఇష్యూ కష్టతరంగా మారింది. కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కొంతలో కొంత రోడ్లు విశాలంగా ఉన్నప్పటికీ, వెహికిల్స్ రద్దీ కారణంగా పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు మెయిన్ రోడ్డుపై లేకపోవడంతో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అనువైన ప్రాంతాల కోసమై పెద్ద కసరత్తే చేస్తున్నారు. షాపింగ్ మాల్స్ వద్ద కూడా అనువైన, సరైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల కస్టమర్లు నడి రోడ్డుపై నిలుపుతున్నారు. పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయకుండా రోడ్లకిరువైపులా చిరు వ్యాపారులు వ్యాపారం చేస్తుండటం కూడా పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసే విషయంపై తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ పట్టణ ప్రణాళిక అధికారులు కలియ తిరిగినా స్పష్టమైన అవగాహనకు రాలేక పోయిన్నట్టు తెలుస్తోంది. ఇక హన్మకొండ, వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని జంక్షన్లు, రోడ్లు అన్నీ ఇరుకుగానే ఉండటంతో, ఈ ప్రాంతాల్లో పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటు గగనంగా మారింది. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు కొలువై ఉన్న ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్లు పూర్తి ఇరుకుగా ఉండి, నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటు కష్టతరంగా మారింది.
ఉన్నతాధికారులు పూనుకొంటేనే :
వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రాలలోని ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారం కోసం కింది స్థాయి అధికారులు పూనుకొంటే కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు. ఉన్నత స్థాయిలో కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో పూనుకొంటే తప్ప, వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రాల్లోని ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు. ఉన్నత స్థాయిలో నడుం బిగించకపోతే ఈ సమస్యకు పక్కా, పకడ్బందీ పరిష్కారం లభ్యమయ్యే అవకాశం కన్పించడం లేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించాలని నగర వాసులు కోరుతున్నారు.