Friday, November 22, 2024

Exclusive | మూసీపై పారిస్‌ తరహా బ్రిడ్జిలు.. ఏడు చోట్ల శంకుస్థాపన చేయనున్న కేటీఆర్!​

ఒకప్పుడు దుర్వాసనకు మారుపేరైన మూసీ నది ఇప్పుడు అందాలకు కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే నది సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం.. పరివాహక ప్రాంతాన్ని రమణీయంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పుడు అద్భుత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకూ చర్యలు చేపట్టింది. పెరుగుతున్న రద్దీతో పాటు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూసీ- ఈసీలపై రూ.545 కోట్లతో 14 వంతెనలు నిర్మించాలని సంకల్పించింది. నగర చారిత్రక నేపథ్యానికి ప్రాధాన్యతమిస్తూ, పారిస్‌ తరహా బ్రిడ్జిల మాదిరిగా నిర్మించే ఈ వంతెనలు సిటీ సిగలో మరో ఐకానిక్‌గా నిలువనున్నాయి.
– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

టెండర్లు పూర్తయిన ఏడు చోట్ల బ్రిడ్జి నిర్మాణ పనులకు ఇవ్వాల (సోమవారం) మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు దుర్గం చెరువులో మురుగునీరు చేరకుండా నిర్మించిన 7ఎంఎల్‌డీ సామర్థ్యం ఉన్న నీటి శుద్ధి కేంద్రాన్ని, దుర్గం చెరువులో రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఫౌంటెయిన్లను ప్రారంభిస్తారు. మూసారాంబాగ్‌ హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకూ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నెక్లెస్‌రోడ్‌లో సుమారు 26 కోట్లతో పది ఎకరాల్లో అత్యద్భుతంగా నిర్మించిన లేక్‌ ఫ్రంట్‌ పార్కును ఈ నెల 26న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

దుర్గంధం కట్టడికి చర్యలు
నివాసాల సమీపంలో నిర్మిస్తున్న ఎస్టీపీల నుంచి దుర్వాసన రాకుండా జలమండలి ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. దీనికోసం ఆధునిక విదేశీ సాంకేతికను అధికారులు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా విశాలమైన ఎస్టీపీల ప్రాంగణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గార్డెనింగ్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు చేపడుతున్నారు. వీటితో పాటు 22 ఎస్టీపీల ప్రాంగణాల్లో సుగంద ద్రవ్యాల జాతికి చెందిన ఆకాశమల్లి, మిల్లింగ్‌ టోనియా, మైకేలియా చంపాకా (సింహాచలం సంపంగి) మొక్కల్ని నాటారు. ఇవి దుర్వాసనను అరికట్టి సువాసనను వెదజల్లుతాయి.

గ్రేటర్‌లో మంత్రి కేటీఆర్‌ షెడ్యూల్‌

  • మధ్యాహ్నం 1 గంటకు హెచ్‌ఆర్‌డీసీఎల్‌ ఆధ్వర్యంలో ఫతుల్లాగూడ నుంచి పీర్జాదిగూడ వరకు మూసీ నదిపై చేపట్టే నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
  • మధ్యాహ్నం 2గంటలకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఐదు బ్రిడ్జి నిర్మాణ పనులకు ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌ శిల్పారామం వద్ద శంకుస్థాపన చేస్తారు.
  • జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మూసారాంబాగ్‌ వద్ద చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు.
  • దుర్గం చెరువు వద్ద 7ఎంఎల్‌డీ సామర్థ్యంలో జలమండలి నిర్మించిన ఎస్టీపీని సాయంత్రం 5:30గంటలకు ప్రారంభిస్తారు.
  • దుర్గం చెరువులో రెండు చోట్ల హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌లను సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభిస్తారు.
  • 26న నెక్లెస్‌ రోడ్డులో లేక్‌ ఫ్రంట్‌ పార్కు
  • హుస్సేన్‌సాగర్‌ తీరంలో హెచ్‌ఎండీఏ సుమారు రూ.26 కోట్లతో 10 ఎకరాల్లో లేక్‌ ఫ్రంట్‌ పార్కును అద్భుతంగా నిర్మించింది. ఈ పార్కును 26న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.
  • 26న పాటిగడ్డలో మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌
  • బేగంపేట్‌ పాటిగడ్డలో రూ.6కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణ పనులు పూర్తికాగా.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. జీ ప్లస్‌ 2 విధానంలో నిర్మించిన ఈ హాల్‌ను 26వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement