స్వామి పరిపూర్ణానంద స్వామి ఏపీ రాజకీయాల్లోకి రానున్నారా ? తాజా పరిణామాలు చూస్తే.. ఇది నిజమే అనిపిస్తోంది. గతంలో తెలంగాణ రాజకీయాల్లో కనిపించిన పరిపూర్ణానంద.. ప్రస్తుతం ఏపీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉపఎన్నిక నేపధ్యంలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన ఆయన… ఏపీ రాజకీయాలపై సీరియర్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్ లో సన్యాసిగా ఉన్న యోగి ఆదిత్యానాథ్ ను అస్త్రంగా మలచుకొని ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ… తెలంగాణలో కూడా పరిపూర్ణానందను అస్త్రంగా మార్చుకోవాలని గతంలో ప్రయత్నించింది. యూపీ ఫార్ములానే ఇప్పుడు ఏపీలో కూడా ప్రయోగించాలని చూస్తోంది. మరి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.
శ్రీపీఠం వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా ప్రజలకు సుపరిచితుడైన స్వామి పరిపూర్ణానంద అసలు పేరు ఏంటనే విషయం చాలా మందికి తెలియదు. తల్లిదండ్రులు, ఇతర వివరాల గురించి కూడా చాలా మంది ఆసక్తి చూపించారు. దీని మీద ఓ వివాదం కూడా నడిచింది. స్వామి పరిపూర్ణానందగా సుపరిచితులైన ఆయన నెల్లూరులో 1972 నవంబర్ 1న జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే తల్లి కోరిక మేరకు ఆధ్యాత్మిక బాట పట్టారు. వేద అధ్యయనం చేశారు. ఆ తర్వాత 16 ఏట రుషీకేష్‌కు వెళ్లారు. అక్కడ దయానంద సరస్వతి స్వామి వద్ద శిష్యరికం చేశారు. ఉపనిషత్‌లు, వాజ్మయాలను అధ్యయనం చేశారు. ఆగమ, మంత్ర, వాస్తు, జ్యొతిష్యములను అధ్యయనం చేశారు. 1999లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీపీఠాన్ని నెలకొల్పారు. ఐశ్వర్యంబికా సమేత సుందరేశ్వర స్వామివారి విగ్రహాలను ప్రతిష్టించారు. కొన్నేళ్ల పాటు శ్రీపీఠంలో ప్రవచనాలు, శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు లేక కరువు కాటకాలు ఏర్పడినప్పుడు 2002లో 32 రోజుల పాటు మహానక్షత్రయాగాన్ని నిర్వహించారు. తన ప్రవచనాల ద్వారా హైందవ ధర్మ ప్రచారం కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా ఎదుర్కొన్నారు.
తెలంగాణలో ధార్మక యాత్రల పేరుతో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యటించారు. హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని చెబుతూనే అన్యమతస్తులను కాస్త రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఆధ్యాత్మికతను అమితంగా ఇష్టపడిన తెలంగాణ సీఎం కేసీఆర్ తొలుత పరిపూర్ణానంద స్వామిని అభిమానించే వారు. అయితే, ఆధ్యాత్మికత ముసుగులో రాజకీయం చేస్తున్నారని భావించి కేసీఆర్.. పరిపూర్ణానందపై చర్యలు తీసుకునేందుకు అదను కోసం వేచి చూసి నగర బహిష్కరణ చేశారు.
నగర బహిష్కరణ తర్వాత పరిపూర్ణానంద తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ వెళ్లిపోయారు. నగర బహిష్కరణపై హైకోర్టులో ఆయనకు ఊరట లభించడంతో హైదరాబాద్ తిరిగి వచ్చారు. అప్పుడు స్వామీజీ క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించబోతున్నారని సాధారణ ప్రజలకు కూడా ఓ స్పష్టత వచ్చింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానందనే ప్రకటిస్తారని ప్రచారం కూడా జరిగింది. ఆధ్యాత్మిక మార్గంలో ఎంత త్రికరణశుద్ధిగా పనిచేశానో.. బీజేపీ కోసం అలాగే పని చేస్తానని గతంలో స్వామి పరిపూర్ణానంద అన్నారు. బీజేపీ తన సేవలు ఎక్కడ అవసరం అనుకుంటుందో.. అక్కడికి వెళ్లడానికి సిద్ధమన్నారు. అయితే, ఇంత కాలం పెద్దగా కనిపించని స్వామి.. తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా దర్శనం ఇవ్వడం.. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
రాయలసీమను కొందరు ఫ్యాక్షన్ గడ్డగా మార్చారని పరిపూర్ణానంద ఆరోపించారు. ఇప్పుడు ఫ్యాక్షన్ గడ్డ అనే పేరు చెరిపేసే నాయకుడు రావాలని ఆకాంక్షించారు. రాయలసీమ నుంచి రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఏ ఒక్క ముఖ్యమంత్రీ పాడుపడలేదని పరిపూర్ణానంద ఆరోపించారు. రాయలసీమను తిరిగి రతనాల సీమగా మార్చే పార్టీ బీజేపీ మాత్రమేనని అంటున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపిస్తే మార్పు ఇక్కడి నుంచే ఆరంభమవుతుందన్నారు.
పరిపూర్ణానంద వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన ఏపీ రాజకీయాలపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో పవన్ కల్యాణే సీఎం అభ్యర్థి అంటూ ఏపీ బీజేపీ నేతలు స్టేట్ మెంట్లు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలో తన బలం పెంచుకోవాలని పరిపూర్ణానంద భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్న అనుకున్నట్లు జరిగే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానంతో తననే సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే ఉత్తర ప్రదేశ్ లో సన్యాసిగా ఉన్న యోగి ఆదిత్యానాథ్ ను అస్త్రంగా ఏపీలో అనకు అనుకూలంగా మార్చుకునేందుకు పరిపూర్ణానంద ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.