యాచకులుగా ఎందుకు మారతారు అంటే ఎన్నో జవాబులు వస్తుంటాయి..పిల్లలు వదిలేయడం వలనో, ఏ పని చేయడం చేతకాకనో,వృద్ధాప్యం వల్లనో ఇలా పలు రకాల కారణాలు ఉంటాయి. అయితే వీరిలో చదువుకున్న వారు ఎంతమంది ఉంటారనే విషయం ఎంతమందికి తెలుసు..చదువుకున్న వారు సరే..ఆ యాచకులు అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడితే అది సెన్సేషన్ వార్తనే చెప్పాలి. అక్షరాలా ఇదే జరిగింది యూపీలోని వారణాసిలో. స్వాతి అనే యాచకురాలు ఇంగ్లీష్‌లో అవలీలగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణ భారత్ కి చెందిన స్వాతికి పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడు. తన డెలివరీ సమయంలో ఆమె కుడి కాలు, కుడి చేతికి పెరాలసిస్ వచ్చి నడవలేని స్థితికి చేరుకోడంతో తనను ఇంట్లో నుంచి గెంటేశారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న స్వాతి చివరకు వారణాసికి చేరుకుంది.
గత మూడేళ్ల నుంచి వారణాసిలోనే భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని వెళ్లదీస్తోంది. అయితే స్వాతి బాగా చదువుకుంది. తను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివింది. అందుకే ఇంగ్లీష్‌లో అంత బాగా మాట్లాడుతోంది. కాగా స్వాతి వీడియోను రికార్డు చేసిన వ్యక్తి.. తనకు మంచి ఉద్యోగం చూస్తానని హామీ కూడా ఇచ్చాడు. స్వాతి ఇంగ్లీష్‌లో మాట్లాడిన వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక నెటిజన్లు అయితే.. స్వాతి మాట్లాడే ఇంగ్లీష్‌కు ఫిదా అయిపోతున్నారు. కట్టుకున్నవాడే ఇలా రోడ్డున పడేయటంతో దిక్కు తోచని పరిస్థితిలో యాచకురాలిగా మారిన స్వాతి కథ విని పలువురు కన్నీరు పెడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..