హైదరాబాద్, ఆంధ్రప్రభ: అశోకుని కాలం నుంచి నిజాం ఏలుబడి వరకు అనేక రాజవంశాలకు వేదికై, సంస్థానాధీశులు నిర్మించిన సప్తసముద్రాలకు నిలయమై కాలక్రమేణ కరువుప్రాంతంగా కన్నీరు కార్చిన పాలమూరు పసిడి పంటల క్షేత్రంగా రూపుదిద్దుకోనుంది. సమైక్యపాలనలో నిర్లక్ష్యం నీడలు కమ్మిన ఈ ప్రాంతాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి ఫలితాలు రానున్నాయి. దశాబ్దాలు నిర్లక్ష్యం నీడలోంచి అభివృద్ధి వైపుకు అడుగులు వేసే ఘడియలు ఆసన్నమయ్యాయి. రాత్రింభవళ్లు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు శరవేగంగా ముందుకు వెళ్లుతుండటంతో 26 ఆగస్టున నార్లాపూర్ రిజర్వాయర్ ట్రయల్‌రన్ నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే డ్రై రన్ తో పాటుగా 400 కేవీ సబ్ స్టేషన్ టెస్టింగ్ పనులు పూర్తి అయ్యాయి.
సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు మొదటి దశపనుల్లో భాగంగా తాగునీటిని ఎత్తిపోసేందుకు భారీ బాహుబలి పంపులబిగింపు దాదాపుగా పూర్తి అవుతోంది. జూరాల ప్రాజెక్టు దగ్గర కృష్ణానది నుంచి రోజుకు 2 టీఎం సీలు ఎత్తిపోసేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేశారు. తొలుత నార్లాపూర్‌రిజర్వాయర్ లో కృష్ణా నీటిని ఎత్తిపోస్తారు. ఆతర్వాత దశలవారిగా సముద్రమట్టానికి 269 మీటర్ల ఎత్తు నుంచి 735 మీటర్ల ఎత్తువరకు నీటిని ఎత్తిపోసి 12లక్షల 38 వేల ఎకరాలకు సాగునీటితో పాటుగా1,226 గ్రామాల్లోని 1,546 చెరువులను నింపుతూ ప్రజల దాహార్తినని తీర్చనుంది.
ప్రధానంగా నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రాంతాల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కనున్నాయి. నార్లాపూర్ జలాశయం,ఎదుల జలాశయాల నిర్మాణాలు తుదితదశకు చేకుకోగా ఈనెల 26వ తేదీన ప్రారంభోత్సవానికి సన్నహాలు చేస్తున్నారు. డిండి సబ్ స్టేషన్ నుంచి ఎదుల సబ్ స్టేషన్ వరకు 60 కిలోమీటర్ల లైనింగ్ తోపాటుగా 400 కేవి ట్రాన్స్ మిషన్ పూర్తి కావడంతో ఎత్తిపోతలకు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది.
ప్రత్యేక రాక్ పిల్ నిర్మాణం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అనేక రికార్డులను సృష్టించనుంది. కొండలను సరిహద్దులుగా చేసుకుని దట్టమైన నల్లమల అడవుల భూగర్భం నుంచి సొరంగమార్గాల నిర్మాణం ఒక అద్భుతం కాగా సముద్ర మట్టానికి 735 మీటర్ల ఎత్తులోకి నీటిని ఎత్తిపోసేందుకు అత్యాధునిక ఇంజనీరింగ్ మరో అద్భుతంగా అలరాలనుంది. కాళేశ్వరం పంపు హౌజ్‌ల భూగర్భ నిర్మాణాలకంటే మరింత లోతులో పంపు హౌజ్‌ల నిర్మాణం చరిత్రలో నిలిచి పోనుంది. రిక్టర్ స్కెల్ పై 9 నుంచి 10 పాయింట్ల భూకంపం నమోదైన చెక్కుచెదరని రీతిలో నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు.
అయితే మరో ప్రధాన రికార్డు రాక్ ఫిల్ నిర్మాణం. 75 మీటర్ల ఎత్తు కట్టలు నిర్మించేందుకు నార్లాపూర్ రిజర్వాయర్‌కు 2కోట్ల 26 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అందుబాటులో లేకపోవడంతో పూర్తి స్థాయిలో రాళ్లతో నిర్మించిన నార్లాపూర్ రిజర్వార్ కట్ట ఉత్తరా ఖాండ్ లోని తెహ్రీ డ్యాం కంటే పెద్దది గా చరిత్రలో నిలవనుంది. ఇక రిజర్వాయర్ల కట్ట పొడవు లో నార్లాపూర్ 6.647 కి.మీ, ఏదుల 7.716 కి.మీ, వట్టెం 14,75 కి.మీ, ఉద్దండాపూర్ 15. 875 కిలో మీటర్ల పొడవుతో భారీ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి అవుతున్నాయి. ప్రాజెక్టు అంచనావ్యయాన్ని సవరించి రూ. 52 వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనుల్లో మొదటిదశలో దాదపుగా 80 నుంచి 90 శాతం పనులు పూర్తి అయినట్లు సమాచారం.
18 ప్యాకేజీలుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనుల్లో అప్రోచ్ చానల్లు, పంపి హౌజ్‌లనిర్మాణాలు, సర్జీ పూల్ నిర్మాణాలు, సుమారు 70 కిలోమీటర్ల మేర ఓపెన్ కాలువలు, 65. 21 కిలోమీటర్ల సొరంగాలు, మూడు 400/11 కేవీ సబ్ స్టేషన్ల పనులు పూర్తి అవడంతో పాటుగా శ్రీశైలం బ్యాక్ వాటర్ పుష్కలంగా ఉండటంతో తొలుత 8.51 టీఎంసీల నార్లాపూర్(అంజనగిరి) రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ పనులు పూర్తి చేసి ఆగస్టు 26న ట్రయల్ రన్ పూర్తి చేసేందుకు సన్నహాలు ఋచేస్తున్నారు.
పనుల్లో వేగం పెంచాం: చీఫ్ ఇంజనీర్ హమీద్ ఖాన్
సీఎం ఆదేశాలమేరకు నిర్దేశిత గడువులోగా మొదటి దశలో భాగంగా తాగునీటి ఎత్తిపోతలను ప్రారంబించడమే లక్ష్యంగా అధికార యంత్రాగం సన్నహాలు చేస్తోందని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ హమీద్ ఖాన్ చెప్పారు. 145 మెగావాట్ల సామర్ధ్యంగల భారీ పంపుల అమరిక కూడా పూర్తి అయిందన్నారు. పంపు హౌజ్ లకు సంబంధించి ఎలక్ట్రో మెకానికల్ సామాగ్రి పనితీరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఏదుల, వట్టెంపంపు హౌజ్‌ల నిర్మాణం పూర్తి అయ్యాయని తెలిపారు. సీఎం ఆదేశాలమేరకు నీటిపారుదల శాఖ పనుల్లో వేగం పెంచిందన్నారు. ఆగస్టు 26న నార్లపూర్ ఎత్తిపోతల ట్రయల్ రన్ చేసందుకు పనుల్లో వేగం పెంచినట్లు ఆయన తెలిపారు. మొదటి దశ పూర్తి చేసి 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖ రాత్రింభవళ్లు శ్రమిస్తోందని చెప్పారు.
దక్షిణ తెలంగాణ వరదాయిని: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
పాలమూరు ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కృష్ణమ్మ జలధారలతో పాలమూరు ప్రజల పాదాలు కడగబోతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆంధ్రప్రభతో చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతలతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం ఆయిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కాబోతోందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4 లక్షల ఎకరాల భూమి వ్యవసాయ యోగ్యంగా ఉందని చెప్పారు. ఇందులో 35 లక్షల ఎకరాల సాగుకు యోగ్యంగా ఉందన్నారు. దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వరప్రదాయిని కానుందని చెప్పారు. జూరాల, నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాలమూరు కష్టాలు తీరబోతున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు,తాగునీటికి ఢోకా ఉండదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో కరువు ప్రాంతాలు సస్యశ్యామలం కానున్నాయన్నారు.