శ్రీలంక లాంటి పరిస్థితి పాకిస్థాన్‌లో తలెత్తడానికి చాన్సెస్ ఉన్నాయని, ఆ సమయం ఎంతో దూరంలో లేదన్నారు ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. దేశంలో మాఫియాల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు త్వరలో వీధుల్లోకి వస్తారని హెచ్చరించారు. తన అభిప్రాయాలు, ఆందోళనలను వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. దేశంలో తన పరిపాలన తర్వాత పరిస్థితులు దారుణంగా మారాయని, ‘హకీకీ ఆజాదీ’ కోసం తన పిలుపుతో చాలామంది స్పందించారన్నారు.
కేవలం మూడు నెలల్లో జర్దారీ-షరీఫ్‌ల మాఫియా రాజకీయంగా, ఆర్థికంగా దేశాన్ని పతనం వైపు తీసుకెళ్తుందని, దీన్ని రాష్ట్ర సంస్థలు ఎంతకాలం భరిస్తాయని ఇమ్రాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేవలం 30 ఏళ్లుగా పాకిస్థాన్‌ను దోచుకుంటూ అక్రమంగా పోగుచేసిన తమ సంపదను కాపాడుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.
దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే ప్రయత్నంలో జాతీయ ఆస్తుల విక్రయానికి సంబంధించిన ఆర్డినెన్స్ ను ఫెడరల్ కేబినెట్ ఆమోదించిన ఒక రోజు తర్వాత ఖాన్ చట్టాన్ని వ్యతిరేకించారు. “దొంగలు” ఆస్తులను విక్రయించడానికి అనుమతించరాదని తన ట్విట్టర్లో తెలిపారు. ఇంకా.. అమెరికా కుట్ర ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇదని, ‘క్రైమ్ మినిస్టర్’ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిందని తెలిపాడు ఇమ్రాన్.
జర్దారీతో పాటు వారి కుటుంబం అవినీతిపై ఎన్నో పుస్తకాలు వస్తున్నాయన్నారు. ఈ వ్యక్తులు 30 సంవత్సరాలుగా పాకిస్తాన్‌ను దోచుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మాంద్యంకు బాధ్యత వహిస్తారా? ఈ దొంగలు మన జాతీయ ఆస్తులను మోసపూరిత పద్ధతిలో విక్రయించడానికి ఎన్నటికీ అనుమతించకూడదు అని దేశ ప్రజలకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు ఇమ్రాన్ ఖాన్.