Tuesday, November 26, 2024

Paddy War: కేంద్రం లెట‌రిచ్చినా.. కేసీఆర్‌ 10శాతం కూడా వ‌డ్లు కొన‌లే: బండి సంజ‌య్‌

వ్యవసాయ చట్టాలను సమర్ధిస్తూ సీఎం కేసీఆర్ జై అన్నడని, దానికి త‌మ ద‌గ్గ‌ర సాక్ష్యాలున్నాయ‌న్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్‌. మొల‌క‌ల‌చ్చిన వ‌డ్లు మొత్తం కొనాలే అన్నారు. అంతేకాకుండా ధ‌ర్నా చౌక్ అంటేనే ఇష్టం లేని సీఎంను ఈ రోజు ధ‌ర్నా చౌక్ ద‌గ్గ‌రికే తీసుకొచ్చామ‌న్నారు సంజ‌య్‌. ఈ రోజు మీడియాతో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా పలు అంశాల‌ను లేవ‌నెత్తారు బండి సంజ‌య్‌.. ఆయ‌న మాటల్లోనే..

కేసీఆర్ ఈరోజు చట్టాలను రద్దు చేయాలంటుండు. పైగా కేసీఆర్ దీక్ష చేస్తే ఢిల్లీ దిగొచ్చిందని పాలాభిషేకాలు చేస్తుండ్రు. అసలు మీ ధర్నా పంజాబ్ వాళ్ల కోసమా? తెలంగాణ వాళ్ల కోసమా? ఆనాడు ధర్నాలతో శబ్ద కాలుష్యం వస్తుందని చెప్పి ధర్నా చౌక్ ఎత్తేసినవ్. ఈరోజు నువ్వే ధర్నా చేస్తున్నవ్. నువ్వు ఎత్తేసిన ధర్నా చౌక్ దగ్గరకే నిన్ను పట్టుకొచ్చినం. ఇది గుర్తుంచుకో… రాష్ట్రమంతా వాన పడుతోంది. వడ్లు నెలరోజులుగా రోడ్లపై, కొనుగోలు కేంద్రాలవద్ద ఆరబోసి ఉన్నయ్. చాలా జిల్లాల్లో వేల మంది రైతుల ధాన్యం తడిసి మొలకలు వచ్చినయ్. రోడ్డు మీద ఉన్న వానా కాలం వడ్లన్నీ కొనమంటే నీ మనసు కరగడం లేదు. యాసంగి మాట ఎత్తుతున్నవ్. అన్నారు సంజ‌య్‌..

కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు లెటర్ ఇచ్చినా అందులో 10 శాతం కూడా కొనలే. 6 గురు రైతులు వడ్ల కుప్పపై గుండె ఆగి చచ్చిపోయిండ్రు. నెలన్నర నుండి మేం హెచ్చరిస్తూనే ఉన్నం. మేం కల్లాలను సందర్శిస్తే రాళ్లు, కర్రలతో దాడి చేయించి రైతుల, బీజేపీ కార్యకర్తల తలలు పగలగొట్టిండ్రు. వడ్లన్నీ రైతులు, బీజేపీ కార్యకర్తల రక్తంతో తడిసినయ్. నాలుగు రోజులు వెనుకా ముందైనా కొంటనని కేసీఆర్ అంటుండు. వాన నీ కోసం ఆగుతుందా? కోతలు ఆపాలట. నువ్వు అసలు ఏనాడైనా పంట పండించినవా? కోతలు ఆపితే గింజలు రాలిపోవా? కొనుగోలు కేంద్రాల వద్దకు వడ్లు తేవొద్దంట. వడ్లను యాడ పోసుకోవాలి? ప్రగతి భవన్ దగ్గర పోయాల్నా? ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్న తడిసిన వడ్ల ప్రతి గింజా కొనాల్సిందే.

ఢిల్లీలో రైతులు చనిపోయిండ్రంట. వాళ్లకు 3 లక్షల రూపాయలు ఇస్తాడట..
ముందుగా తెలంగాణలో వేలమంది రైతులు చనిపోయిండ్రు. NCRB రిపోర్ట్ ప్రకారం రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రానిది 4వ స్థానం. 2019 లో 419 మంది 2020 లో 471 మంది రైతులు బలయ్యారు. ఇంకా లెక్క తీస్తే చాలా ఉంది. నీ ‘వరి-ఉరి’ కామెంట్ తో ఐదుగురు రైతులు చనిపోయిండ్రు. ఇప్పుడు వడ్ల కుప్పపై ఆరుగురు రైతులు చనిపోయిండ్రు. నీకు నిజంగా రైతులపట్ల ప్రేమ ఉంటే వాళ్లకు ముందుగా 25లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వు. ఎందుకంటే వీళ్లంతా నీ అసమర్ధత వల్లే చనిపోయిండ్రు. నీ మూలంగా ఈ ఏడేళ్లలో వందలాది మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆ కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వు. నీ కొడుకు నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయిండ్రు. వారి కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వు. ఢిల్లీ సంగతి తర్వాత .. ముందుగా నిన్ను నమ్మి ఓటేసిన రైతు సంగతి ముందు చూడు. అన్నారు బీజేపీ నేత సంజ‌య్‌.

ట్రిబ్యునల్ ఏర్పాటుపై విలేక‌రులు అడిగిన ప్రశ్నకు… ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి కారకుడే కేసీఆర్. సుప్రీంకోర్టులో కేసు వేసి ఏడేళ్లుగా నాన్చి కేంద్రానిదే బాధ్యత అనడం సిగ్గచేటు. ఇది నా మాట కాదు.. మూడు రోజుల క్రింత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ మాట (ఇదిగో పేపర్ క్లిప్పింగ్). నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆరే. క్రిష్ణా పరివాహక ప్రాంతానికి అనుగుణంగా తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా. 299 టీఎంసీలను కేటాయించే ఒప్పంద పత్రాలపై అపెక్స్ కమిటీ సమావేశంలో సంతకం చేసిన ఘనుడు కేసీఆర్. ఈ పెద్దమనిషి ఈరోజు నీటి వాటా తేల్చాలి. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని చెప్పడం సిగ్గుచేటు. సుప్రీంకోర్టులో కేసులుండగా ట్రిబ్యునల్ ఏర్పాటు సాధ్యం కాదని గత ఏడేళ్లుగా కేంద్రం పదేపదే చెబుతున్నా పట్టించుకోని ఈ మూర్ఖపు సీఎం కేంద్ర మంత్రి చెబితేగానీ సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోలేదు. కేసును ఉపసంహరించుకోవడానికే ఏడేళ్ల టైం తీసుకున్న కేసీఆర్. నిద్రలేచిందే తడువుగా ఇప్పటికిప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనడం సిగ్గుచేటు. ట్రిబ్యునల్ ఏర్పాటంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సుప్రీంకోర్టుకు ప్రతిపాదించాలి. ఆమోదం పొందాలంటే చాలా తతంగం ఉంటుందనే సంగతి కేసీఆర్ కు తెలుసు. అయినా ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ది పొందాలనే కుట్రతోనే ట్రిబ్యునల్ అంశాన్ని తెరమీదకు తీసుకొస్తుండు. అని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement