వలసదారులతో యూరప్ కి వెళ్లేందుకు ప్రయత్నస్తున్న సమయంలో ఆఫ్రికాలోని సెనెగల్ సముద్ర తీరంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరి కొంత మంది గల్లంతయ్యారు. వలసదారులతో యూరప్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వలసదారుల మృతిని రెడ్ క్రాస్ అధికారులు ధృవీకరించారు. ఈ దురదృష్టకర ఘటన దక్షిణ కాసామాన్స్ ప్రాంతంలోని కఫౌంటైన్ సమీపంలో జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ పడవలో సుమారు 150 మంది ఉన్నారు. ఇందులో దాదాపు 91 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. మరో 40 మందికిపైగా కనిపించకుండా పోయారు. మిగితా వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.
ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు సాల్ సంతాపం తెలిపారు. కాగా పడవలో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో అది బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్థానిక మీడియా సంస్జలు వెల్లడించాయి. అయితే అసలు మంటలు చెలరేగడానికి కారణం ఏంటనే విషయంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. చాలా కాలంగా ఇక్కడి నుంచి వలసలు కొనసాగుతున్నాయి. చాలా ప్రమాదకరైన పరిస్థితుల్లో చిన్న చిన్న పడవలను తీసుకొని ఐరోపాకు వెళ్తుంటారు. ఇలా ప్రతీ సంవత్సరం జరుగుతుంటుంది. ఈ క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ఆగస్టులో కూడా పెద్ద ప్రమాదమే జరిగింది. సెయింట్ లూయిస్ వద్ద పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మంది వరకు చనిపోయారని అధికారులు తెలియజేశారు.