పిల్లలే కదా ఆడుకోనిలే అని వదిలేస్తే.. ఆ పిల్లలకు గేమ్ లకు బానిసలై.. చివరకు ఆ పిచ్చి పీక్స్ కు వెళ్తుంది. అలాంటి ఘటనే పాకిస్తాన్ లో జరిగింది. ఓ బాలుడు ఆన్‌లైన్‌లో పబ్జీకి బానిసై తన కుటుంబ సభ్యులనే కడతేర్చాడు. తల్లి, సోదరుడితో పాటు ఇద్దరు సోదరీమణులను కాల్చిచంపాడు. ఈ దారుణ ఘటన పాకిస్తాన్‌లో జరిగింది. లాహోర్‌లోని కహ్నా ప్రాంతానికి చెందిన 45ఏళ్ల నహిద్ ముబారక్ హెల్త్ వర్కర్‌గా పని చేస్తున్నారు.
కొన్నేళ్ల క్రితమే భర్తతో విడిపోయి పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆమెకు 22ఏళ్ల కుమారుడు తైమూర్, 17, 11 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లతో పాటు మరో మైనర్ బాలుడు ఉన్నారు. అయితే మైనర్ బాలుడు పబ్జీ గేమ్‌కి బానిసయ్యాడు. తల్లి పలుమార్లు మందలించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదే విషయంపై కుమారుడి మీద నహిద్ మళ్లీ కోపం ప్రదర్శించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు కప్‌బోర్డులోని తుపాకీ తీసుకొని తల్లితోపాటు సోదరుడు, ఇద్దరు సోదరీమణులను కాల్చి చంపాడు. అనంతరం తన కుటుంబాన్ని ఎవరో చంపారంటూ పొరుగింటి వారికి తెలియజేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే తనకేమీ తెలియదని, ఘటన జరిగినప్పుడు తాను ఇంటిపై ఉన్నానని బుకాయించాడు. అనుమానంతో పోలీసులు కాస్త గట్టిగా విచారించడంతో నిజం అంగీకరించాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..