Thursday, November 21, 2024

సిటీ స్కాన్ ధరలను నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ చికిత్స, వివిధ పరీక్షలకు సంబంధించి ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కోవిడ్ చికిత్సలో ప్రధానంగా మారిన సిటీ స్కాన్‌కు సంబంధించి రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులు, ల్యాబ్‌లకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలోని ఆసుపత్రులు, ల్యాబ్‌లలో సిటీ స్కాన్ ధరను రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. సిటీ స్కాన్, పాజిటివ్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ 19 డ్యాష్ బోర్డులో పాజిటివ్ రోగుల వివరాలని నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ రోగుల చికిత్సను కూడా వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చింది. ఇప్పటివరకూ 1.01 లక్షల మంది కోవిడ్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా వైద్యసేవల్ని అందించింది. దీనికోసం ఏకంగా రూ.309.61 కోట్లు ఖర్చు చేసింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు ప్రభుత్వం ఉచిత చికిత్స ప్రారంభించింది. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో సిటీ స్కాన్ పరీక్షల పేరిట వివిధ ఆసుపత్రులు, ల్యాబ్‌లలో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ధరలపై నియంత్రణ విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement