తెలంగాణలో సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. రోజురోజుకీ కరోనా వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో చాలా రాష్ట్రాల్లో అవసరమైన పేషంట్లకు ఇవ్వడానికి మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఇక తెలంగాణలో ప్రైవేటు ఆసుత్రుల్లో ఆక్సిజన్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కోవిడ్ బాదితులు. ప్రైవేటు ఆసుపత్రులు సైతం వారి దగ్గర సరిపడ ఆక్సిజన్ లేకపోవడంతో చేసేది లేక చేతులు ఎత్తేస్తున్నారు.
వరంగల్ జిల్లాలో కరోనా విజృంభణతో ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కట్టారు. దీంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్ లేక ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులు పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. మరోవైపు ఆక్సిజన్ కొరతతో ఆస్పత్రులలో ఇదే అదునుగా తీసుకుని ఫీజుల మోత మోగిస్తున్నారు. ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ ఆక్సిజన్ కొరత లేదని చెప్పిన రోజు నుంచే ఆక్సిజన్ కొరత ఏర్పడిందని స్థానికులు, రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతు ప్రాణాలు పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి ఆసుపత్రుల్లో వెంటిలేటర్ బెడ్స్ నిండుకున్నాయి. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో సదుపాయాల కొరతతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.