కరోనా వైరస్ కంటే భవిష్యత్త్ లో వచ్చే మహమ్మారులు మరింత ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా ఉంటాయని ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సృష్టికర్తలలో ఒకరైన ప్రొఫెసర్ డేమ్ సారా గిల్బర్ట్ తెలిపారు. కొత్త వైరస్ లను ఎదుర్కొవడానికి ప్రపంచం సిద్ధంగా ఉందనే విషయాన్ని నిర్థారించుకోవాలని ఆమె అన్నారు. బ్రిటన్‌లో జరిగిన 44వ రిచర్డ్ డింబ్లేబీ లెక్చర్ సదస్సులో సారా గిల్బర్ట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. నిజం ఏమిటంటే, భవిష్యత్తులో వచ్చే వైరస్ లు మరింత విధ్వంసకరంగా, ప్రాణాంతకంగా ఉండవచ్చు. అది మరింత అంటువ్యాధి కావచ్చు, లేదా మరింత ప్రాణాంతకం కావచ్చు లేదా రెండూ కావచ్చు. మన జీవితాలను, మన జీవనోపాధికి ముప్పు కలిగించే వైరస్ లలో కరోనా మహమ్మారే చివరిది కాదనేది గుర్తించాలి. భవిష్యత్తులో రాబోయే మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచం మెరుగ్గా సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవాలి. వైరస్‌లను ఎదుర్కొనే పోరాటంలో ఇప్పటికే ఎంతో ప్రగతి సాధించాం. అయితే, రాబోయే మహమ్మారులను ఎదుర్కొనేందుకు అధిక మొత్తంలో ఫండింగ్ అవసరమని ప్రొఫెసర్ డేమ్ సారా గిల్బర్ట్ తెలిపారు. ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ గా సారా గిల్బర్ట్ ఉన్నారు.
వైరస్‌లపై తమ పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి సైతం ఆమె మాట్లాడారు. ఇదివరకు వెలుగుచూసిన కరోనా వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వేరియంట్ అధిక వ్యాప్తిలో విజృంభించే అవకాశాలున్నాయన్నారు. దీనికి ప్రధాన కారణం ఒమిక్రాన్ వేరియంట్ యొక్క స్పైక్ ప్రొటీన్‌లో వైరస్ వ్యాప్తిని పెంచే ఉత్పరివర్తనలు అధికంగా ఉండటమేనని వివరించారు. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్‌పై తక్కువ ప్రభావం చూపే అవకాశాలు సైతం ఉన్నాయని వెల్లడించారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఒక నిర్ధారణకు రావడానికి తగినంత సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదన్నారు. ఒమిక్రాన్ గురించి మరింత డేటా అందుబాటులోకి వచ్చేంత వరకు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని అన్నారు. తప్పనిసరిగా అందరూ వ్యాక్సిన్ ని వేయించుకోవాలని సూచించారు.. మాస్క్ లు , శానిటైజర్ ని మరవొద్దని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..