దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నిక బరిలో నిలిచిన హైదరాబాద్ కు చెందిన మజ్లిస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మజ్లిస్ తరుపును పోటీ చేస్తున్న 9 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు.
దేశంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి నుంచి జరగనున్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. దేశంలో బీహార్, మహారాష్ట్రలలో ఖాతా తెరిచిన మజ్లిస్ పార్టీ.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పాగా వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల్లో 9 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు.
ఘజియాబాద్ నుంచి డాక్టర్ మెహతాబ్, హాపూర్‌లోని గర్త్ ముక్తేశ్వర్ నుంచి పుర్కాన్ చౌదరి, హాపూర్లోని మరో నియోజకవర్గం ధౌలోనా నుంచి హాజీ ఆరిఫ్ బరిలో ఉన్నారు. ఇక మీరట్‌లోని సివాల్ ఖాస్ నియోజకవర్గం నుంచి రఫాత్ ఖాన్, సర్దనా నుంచి జీషన్ ఆలం, మీరట్ నుంచి కిథోర్, సహారన్ పూర్ నుంచి అమ్జాద్ అలీ బెహత్, బరేలీ-124 నుంచి షహీన్ రజా ఖాన్, సహారన్ పూర్ దేహత్ నుంచి మర్గూబ్ హసన్ బరిలో ఉన్నారు.
ఎంఐఎం ప్రకటించిన తొలి జాబితాలో ఉన్న నియోజకవర్గాలన్నీ ముస్లిం ప్రాబల్యమున్నవే ఉన్నాయి. ఇక, అభ్యర్ధులు కూడా ముస్లింలే ఉండడంతో ఆపార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు.