Friday, November 22, 2024

Surrender: జనతన సర్కారుకు బీటలు.. 500 మంది మావోయిస్టు మద్దతుదారుల లొంగుబాటు!

మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఆంధ్రా, ఒడిశా బోర్డర్​లోని పరిస్థితులు మారుతున్నాయి. జనతన సర్కారు నుంచి అక్కడి ప్రజలు ప్రజా జీవితంలోకి వస్తున్నారు. మల్కన్‌గిరి జిల్లా స్వాభిమాన్ అంచల్‌లో సోమవారం ఒడిశా పోలీసుల ఎదుట 500 మందికి పైగా మావోయిస్టు మద్దతుదారులు లొంగిపోయారు. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఎస్.కె. బన్సాల్ వెల్లడించారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

జూన్ 11న 295 మంది మావోయిస్టు మద్దతుదారులు పోలీసుల ముందు లొంగిపోయిన తర్వాత రాలెగడ GPకి చెందిన మరో 500 మంది ఈరోజు మల్కన్‌గిరి పోలీసులు, BSF ముందు లొంగిపోయారు. ఒడిశా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో వారు ప్రేరణ పొందారు’’ అని డీజీపీ ట్వీట్ చేశారు. ఇక.. మావోయిస్టు సిద్ధాంతంపై తమ వ్యతిరేకతను తెలియజేసేలా మావోయిస్టుల దుస్తులను తగులబెట్టి ‘మావోబడి (మావోయిస్ట్) ముర్దాబాద్’ అని నినాదాలు చేశారని తెలిపారు.

ఈ మిలీషియాలో పేపర్‌మెట్ల పోలీస్ స్టేషన్​.. రాలెగడ పంచాయతీ పరిధిలోని దబల్ పహాడ్, రాలెగడ, చింతల్‌దులి, కొర్రపల్లి, టేక్‌పడార్, పాలంక్రాయి, తాటిపహాడ్, ఎస్కపల్లి, సరుకబండ, దుర్గం, బనజోలి, చీకట్‌పల్లి, జాజ్‌పల్లి, గజల్‌మామిడి, సీతపల్లి గ్రామాలకు చెందిన మహిళలు, పురుషులున్నారు.  ఈ గ్రామాలన్నీ ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నాయని, ఇవి గతంలో మావోయిస్టులకు బలమైన కోటగా ఉన్నాయని పోలీసులు తెలిపారు.

వారు స్వచ్ఛందంగా జాన్‌బాయిలోని బీఎస్‌ఎఫ్ క్యాంపు వద్దకు వచ్చి మల్కన్‌గిరి ఎస్పీ నితేశ్ వాధ్వానీ, మల్కన్‌గిరి బీఎస్‌ఎఫ్ డీఐజీ సమక్షంలో ఒడిశా పోలీసుల ఎదుట లొంగిపోయారు. స్వాభిమాన్ అంచల్ గత రెండు దశాబ్దాలుగా అత్యధిక హింసను చవిచూసింది. ఈ మావోయిస్టు మద్దతుదారులు హింసాత్మక కార్యకలాపాల్లో మావోయిస్టులకు సహాయం చేసేవారని, భద్రతా బలగాలు, పౌరులను హతమార్చడంలో పాలుపంచుకున్నారని.. వారికి అన్ని రకాల వస్తువులు, ఫుడ్​ సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

లొంగిపోయే ముందు మావోయిస్టు మద్దతుదారులు మావోయిస్టుల దుస్తులను తగులబెట్టారు. మావోయిస్టు అమరవీరుల స్థూపాన్ని ధ్వంసం చేశారు. “మావోబడి ముర్దాబాద్” నినాదాలు ఇచ్చారు. స్వాభిమాన్ అంచల్‌ను విముక్తి పొందిన జోన్‌గా పరిగణించి మావోయిస్టులు అక్కడ జనతన సర్కార్‌ను నడిపారు. మావోయిస్టుల చేతిలో 37 మంది గ్రేహౌండ్ జవాన్లు, 7 మంది బీఎస్ఎఫ్ జవాన్లు, 4 మంది ఒడిశా పోలీసులు, 40 మంది అమాయక స్థానిక గిరిజనులు మరణించారు. వేలాది మంది స్థానిక గ్రామస్తులు భయంతో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది.

రెండు దశాబ్దాలకు పైగా సీపీఐ (మావోయిస్ట్‌)కి చెందిన ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ (ఏఓబీఎస్‌జెడ్‌సీ) మావోయిస్టులకు సురక్షిత స్వర్గధామంగా ఉన్న 9 జీపీలు, 182 గ్రామాలతో కూడిన ఈ ప్రాంతం వేగంగా మలుపు తిరుగుతోంది. గురుప్రియ వంతెన నిర్మాణం, ఒడిశా ప్రభుత్వం యొక్క ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలతో పాటు భద్రతా బలగాల వ్యూహాత్మక మోహరింపు గ్రామస్తులను ప్రధాన స్రవంతిలో చేరడానికి ప్రేరేపించాయని ఒక అధికారి తెలిపారు. అంతకుముందు జూన్‌లో ఈ ప్రాంతంలోని 450 మంది క్రియాశీల హార్డ్ కోర్ మావోయిస్టు మద్దతుదారులు పోలీసుల ముందు లొంగిపోయారు, ప్రధాన స్రవంతిలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement