దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. థర్డ్ వేవ్ లో విరుచుకుపడుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. తెలంగాణలో గత కొద్ది రోజులు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టింది. రాష్ట్రంలో ఇంటింటా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పుల సమస్యలు తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవల్లో ఈ విషయాన్ని గుర్తించారు. కేవలం 9 రోజుల వ్యవధిలోనే మొత్తం 4,00,283 మందిలో కొవిడ్ లక్షణాలున్నట్లు సర్వే ద్వారా గుర్తించారు.
మొత్తం 90 లక్షల పైగా ఇళ్లలోనూ, ఆసుపత్రి ఓపీల్లో మరో 6.58 లక్షల మందిని పరిశీలించగాపై విషయం నిర్ధారణ అయింది. అయతే వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కాకపోయినా 3,97,898 మందికి ఔషధ కిట్లు అందించారు. జనవరి 21 నుంచి 29వ తేదీ వరకు ఫీవర్ సర్వే, కొవిడ్ ఓపీ సేవల్లో భాగంగా కిట్లను పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,170 ఓపీ కేంద్రాలను నిర్వహించగా.. 6,58,879 మందిలో జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పిలు తదితర సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో 94,910 మందికి కొవిడ్ లక్షణాలున్నట్లు వైద్యసిబ్బంది గుర్తించారు. వారికి కొవిడ్ కిట్లు అందజేశారు. ఓపీ సేవల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 1,70,962 మంది వైద్యులను సంప్రదించారు. ఇక్కడ 18,758 కిట్లను అందించారు. రెండో విడత సర్వే జగిత్యాల, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, వనపర్తి, నిజామాబాద్, భద్రాద్రి, మంచిర్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రారంభమైంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.