Saturday, November 23, 2024

100 మందికిపైగా పీఎఫ్ఐ సభ్యుల అరెస్ట్ -వారి ఇళ్ల‌పై ఈడీ దాడులు

జాతీయ ద‌ర్యాప్తు సంస్థ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, వ్యవస్థీకృత శిక్షణ, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యాలయాలు, దాని సభ్యుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో దాడులు జరిగాయి. కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ దాడుల్లో 200 మందికిపైగా ఎన్ఐఏ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మందికిపైగా పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేశారు.

వీరిలో సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఎన్ఐఏకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఆందోళన చేపట్టిన పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐ సభ్యులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. కేరళలోని మల్లపురం జిల్లా ముంజేరిలోని పీఎఫ్ఐ చైర్మన్ సలాం ఇంటిపై అర్ధరాత్రి మొదలైన దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడులపై పీఎఫ్ఐ కేరళ కార్యదర్శి అబ్దుల్ సత్తార్ స్పందించారు. రాష్ట్రంలోని తమ సంస్థ కార్యాలయాలపై ఈడీ, ఎన్ఐఏలు దాడులు చేసిన విషయాన్ని నిర్ధారించారు. నాయకుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులకు దిగడం నిరంకుశత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సోదాల సందర్భంగా 22 మందిని కేరళలో అరెస్ట్ చేయగా, మహారాష్ట్ర, కర్ణాటకలలో చెరో 20 మందిని అరెస్ట్ చేశారు. తమిళనాడులో 10 మందిని, అసోంలో 9 మందిని, ఉత్తరప్రదేశ్‌లో 8 మందిని, ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురిని, మధ్యప్రదేశ్‌లో నలుగురిని, ఢిల్లీ, పుదుచ్చేరిలో చెరో ముగ్గురిని, రాజస్థాన్‌లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కాగా, పీఎఫ్ఐ సంస్థను త్వరలో నిషేధించే అవకాశం ఉన్నట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement