కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే తమ కూతురు చనిపోయిందని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆ వ్యాక్సిన్ కంపెనీ బాధ్యత వహించాలని కోరుతూ కేరళ రాష్ట్రంలో బాధిత కుటుంబం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపించారు పతనంతిట్టాకు చెందిన సాబు సి థామస్, అతని భార్య జీన్ జార్జ్. తమ కూతురు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతోందని, తమకు ఇప్పుడు ఆదారం లేదని వారు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఏకైక కుమార్తె మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సీరం తయారీదారులను బాధ్యులను చేస్తూ రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని కోరారు.
ఎంఎ లిటరేచర్ స్టూడెంట్ నోవా సాబుకు కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిషీల్డ్ తో వ్యాక్సిన్ వేశారు. ఆ మరుసటి రోజు ఆమె అస్వస్థతకు గురైంది. నోవాను ఆసుపత్రికి తీసుకెళ్లారని, ఆమెకు తలనొప్పి.. జ్వరంతో చికిత్స అందించారని పిటిషన్‌లో వారు పేర్కొన్నారు. అయితే నోవా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆమెను మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె హెల్త్ కండిషన్ మరింత దిగజారింది. అలసట, తలనొప్పి, వాంతులు విపరీతంగా అయ్యాయి. ఇట్లా కొద్దిసేపటికే ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. మూర్చ రావడం ప్రారంభమైంది. అనంతరం ఆమెకు ఇంట్యూబేషన్ చేసి వెంటిలేటర్‌పై ఉంచారు. కాగా, నోవా గత ఏడాది ఆగస్టు 12వ తేదీన ఇంట్రాసెరెబ్రల్ బ్లీడింగ్‌తో చనిపోయింది.
కాగా, పిటిషనర్లు పరిహారం కోరుతూ మొదట మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పతనంతిట్ట జిల్లా వైద్యాధికారి విచారణ కూడా చేపట్టారు. వ్యాక్సినేషన్‌కు ముందు నోవా సాబుకు నాడీ సంబంధిత వ్యాధి ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని దర్యాప్తులో తేలింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న కొద్దిసేపటికే ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. నోవా సాబు థ్రోంబోసైటోపెనియా, థ్రాంబోసిస్ సిండ్రోమ్‌తో బాధపడి ఉండవచ్చు, ఇది కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు రోగనిరోధక ప్రతిస్పందనగా చెప్పవచ్చు. ఇది కోవిడ్‌షీల్డ్ టీకా తర్వాత సంభవించే అరుదైన పరిస్థితి. అని డాక్టర్లు చెబుతున్నారు. అయితే.. ఈ పిటిషన్ నిన్న శుక్రవారం కేరళ హైకోర్టులో విచారణకు రాగా.. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఎన్.నగరేష్ కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరారు.