(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి) : అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగినట్లే నిమ్మకాయల ధర కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. సామాన్యులు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో నిమ్మకాయల వినియోగం పెరిగింది. డిమాండ్‌కు సరిపడే విధంగా సరఫరా లేకపోవడంతో రోజురోజుకు రేట్లు పెరిగిపోతున్నాయి. వేసవికితోడు రంజాన్ మాసం ప్రారంభం కావడంతో నిమ్మకాయలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో పదికి రెండే రెండు అమ్ముతున్నారు. కిలోకు మాత్రం రూ. 400 చొప్పున విక్రయాలు చేస్తున్నారు….ప్రస్తుత ధరను చూసి నిమ్మకాయల వినియోగం వెనకాముందు చూసి వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి..
ఎండాకాలం సామాన్యుని డైట్‌లో తప్పని సరైన నిమ్మకాయలు కొండెక్కి కూర్చున్నాయి. హోల్ సెల్ మార్కెట్లో నిమ్మకాయలు కేజీ రూ.400 దాటగా, రిటేల్ మార్కెట్లో పదికి రెండు చొప్పున అమ్ముతున్నారు. ఎండలు మండుతుండటంతో నిమ్మకాయల ధరలు అమాంతం పెరగాయని వ్యాపారులు అంటున్నారు. ధరలు ఆకాశానంటడంతో నిమ్మకాయ నీళ్లు, నిమ్మకాయ సోడ, లెమన్ టీలు ధనవంతుల డ్రింక్‌గా మారి పోయాయి. ఎండా కాలంలో సామాన్యులు ఎక్కువగా తాగేది నిమ్మనీరు, నిమ్మ సోడా కావడంతో ధరలు వారిని బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన ఏడాది హైదరాబాద్ మార్కెట్లో నిమ్మ సోడ రూ.10 నుంచి రూ.15 ఉండగా ఈ ఏడాది నిమ్మకాయల ధరలు రెండింతలు పెరిగాయి. నిమ్మకాయ సోడా ధర ఏరియాను బట్టి రూ.15 నుంచి రూ.25 అమ్ముతున్నారు. లెమన్ టీ అమ్మే టీ కొట్టు వ్యాపారులు సైతం ధరలను అమాంతం పెంచేసారు. లెమన్ టీ తయారిని నిమ్మకాయ ధరలు తగ్గే వరకు కొన్ని రోజులు నిలిపి వేస్తున్నట్టు చిన్న వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ ప్రజల అవసరాలను తీర్చే ఆంధ్రాలోని ఏలూరు, మహారాష్ట్రలో సైతం నిమ్మకాయల కొరత ఏర్పడటంలోనే ధరలు అకాశానంటాయని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో రూ200 ఉన్న నిమ్మకాయల ధరలు వారం రోజుల్లోనే రెండింతలు పెరిగి రూ.400 చేరింది. నిత్యావసర వస్తువులతో పాటు నిమ్మకాయల ధరలు అమాంతం పెరిగడంతో సామాన్యులు నిమ్మకాయలు కొనేందుకు జంకుతున్నారు.
రంజాన్ మాసం నేపథ్యంలో..
రంజాన్ మాసం ప్రారంభమైంది. వేసవి కాలానికి రంజాన్ మాసం తోడుకావడంతో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రంజాన్ మాసంలో అలీంకు డిమాండ్ ఎక్కువే. చాలామంది అలీం తినేందుకు ఇష్టపడుతుంటారు. అలీం తయారీలో నిమ్మరసం వినియోగిస్తారు. దానికితోడు అలీంలో కలుపుకుని తింటారు.
ఉపవాస దీక్షల సమయంలో కూడా నిమ్మను వినియోగిస్తుంటారు. డిమాండ్‌కు సరిపడే విధంగా సరఫరా లేకపోవడంతో నిమ్మ ధర కొండెక్కింది.
తగ్గిన ఉత్పత్తి,,,పెరిగిన డిమాండ్..
వేసవి తాపం అధికమవడంతో డిమాండ్ పెరగడం.. పెరిగిన డిమాండ్‌కు అనుగునంగా ఉత్పత్తి లేక పోవడంతో నిమ్మకాయల ధరలు అకాశానంటాయి. నిమ్మకాయలను పండించే ప్రాంతాల్లో పంట దిగుబడి సరిగా లేక పోవడం, పెరిగిన ఇందన ధరల వల్ల రవాణా చార్జీలు అధికమవడం తదితర కారణాలు వెరసి వాటి ధరలు సామాన్యునికి అందనంతా పెరుగుతున్నాయి. రాబోయే నెల రోజుల పాటు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు అంటున్నారు. వేసవిలో నిమ్మ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎండలు పెరిగినట్లే వినియోగం కూడా పెరిగిపోతుంది. ఎండలనుండి ఉపశమనం పొందాలంటే తప్పనిసరిగా చాలామంది నిమ్మరసం తాగేందుకు ఇష్టపడతారు. ఇళ్లలో కూడా చాలామంది నిమ్మకాయలు వినియోగిస్తారు. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత చాలామంది ఉదయం కషాయాలు తాగడం అలవాటు చేసుకున్నారు. ధరను బట్టి నిమ్మకాయలను వినియోగించుకునే పరిస్థితులు నెలకొన్నాయి..