మహిళా సిబ్బంది లో దుస్తుల విషయంలో తీసుకొచ్చిన ఉత్తర్వులపై వివాదం చెలరేగింది. దీనికి సంబంధించి పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ (PIA) ఈ మధ్య జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్రంగా విమర్శలొస్తున్నాయి. సరైన లో దుస్తులపై సరైన ఫార్మల్ డ్రెస్ ధరించాలని ఇంటర్నల్ మెమోలో ఆ సంస్థ పేర్కొంది. ఈ ఉత్తర్వులు బయటకు పొక్కడంతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జియో టీవీ కథనం ప్రకారం.. పీఐఏ తన క్యాబిన్ క్రూ, సిబ్బందికి వస్త్రధారణ విషయంలో పలు సూచనలు చేసింది. ‘కొంతమంది క్యాబిన్ సిబ్బంది ఇంటర్‌సిటీలో ప్రయాణిస్తున్నప్పుడు, హోటళ్లలో బస చేస్తున్నప్పుడు సాధారణ దుస్తులు ధరించడం ఆందోళన కలిగిస్తుందని. అలాంటి డ్రెస్సింగ్ విధానం చూసేవారికి పేలవమైన అభిప్రాయాన్ని కలిగిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.
దీంతో సంస్థపైనా నెగెటివ్ ఇమేజ్ వస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో క్యాబిన్ సిబ్బంది సరైన అండర్‌గార్మెంట్స్ పై సరైన ఫార్మల్ డ్రెస్ ధరించాలి. ఆ దుస్తులు కూడా పాక్ సంస్కృతికి తగ్గట్టుగానే ఉండాలని అంతర్గత మెమోలో పేర్కొంది. అయితే ఈ అంతర్గత మెమోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి..
కాగా ఈ ఉత్తర్వులపై నెట్టింట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీనిని ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యియి. దీంతో 24 గంటల్లోపే పీఐఏ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఎయిర్ లైన్స్ సిబ్బంది సరైన వస్త్రధారణతో విధులకు హాజరుకావాలని చెప్పడమే తమ ప్రధాన ఉద్దేశమని, తమ భావాన్ని వ్యక్తపరచడంలో ఎయిర్‌లైన్స్ అధికారులు విఫలమయ్యారని పీఐఏ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు.
మరోవైపు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన క్యాబిన్ సిబ్బంది ఎక్స్‌ట్రా డ్యూటీ వేళలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా ఇటీవల ఈ విషయంపై పీఐఏ సీఈవో అమీర్ హయత్‌కు లేఖ రాసింది.