Tuesday, November 5, 2024

Order.. Order: కాలుష్య నియంత్రణపై అసంతృప్తి.. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం వార్నింగ్​

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంపై.. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వాలు చెప్పినప్పటికీ.. కాలుష్యం తగ్గకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్య నివారణ చర్యల విషయంపై ఈరోజు అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. కాలుష్య నివారణలో పురోగతి లేదని, సమయం మాత్రం వృథా అవుతోందని ధ‌ర్మాస‌నం పేర్కొంది. ఇదే విషయంపై విచారణ జరగటం వరుసగా ఇది నాలుగోవారమని సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గుర్తు చేసింది.

కేంద్రం, ఢిల్లీ, రాజధాని సరిహద్దు రాష్ట్రాలు.. పారిశ్రామిక, వాహనాల వల్ల వచ్చే కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేందుకు 24 గంటల గడువు విధించింది. రేపు మరోసారి ఈ విషయంపై విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. ఒకవేళ గడువులోపు చర్యలు చేపట్టకుంటే.. సుప్రీం కోర్టు స్వయంగా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.

స్కూళ్లు తెరవడంపైనా ఆగ్రహం..
కాలుష్యం వల్ల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో స్కూళ్లు తెరవాలన్న నిర్ణయంపై సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం కారణంగా ఉద్యోగులకే వర్క్​ ఫ్రం హోం ఇచ్చినప్పుడు.. పసి పిల్లలను పాఠశాలలకు రమ్మనడం ఏమిటని ప్రశ్నించింది. కాగా, వాయుకాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను మూసివేయించినట్లు కేంద్రం తరఫున సుప్రీం కోర్టకు వివరించారు సొలిసిటరీ జనరల్​ తుషార్ మెహతా. ఈ వివరాలను ఢిల్లీ ప్రభుత్వానికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణకు జెట్​ స్పీడప్​లో.. అధికారులు 24 గంటలూ పని చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు తుషార్​ మెహతా.

Advertisement

తాజా వార్తలు

Advertisement