Monday, November 18, 2024

వామ్మో ఇవేం ఎండ‌లురా నాయ‌నా.. ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భానుడు భగభగా మండిపోతున్నాడు. నిప్పులు కక్కుతూ.. వేసవి ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెంచుకుంటూ పోతూ.. జనాల మాడలు పగలగొడుతున్నాడు. ఎండలు మండుతుండడంతో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరడంతో ఈ జిల్లాల ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా చాప్రాలలో అత్యధికంగా 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్ల మార్చి నెల ఉష్ణోగ్రతల్లో ఇది కొత్త రికార్డని వాతావరణశాఖ తెలిపింది. గత పదేళ్లలో అత్యధికంగా 2016 మార్చి 18న భద్రాచలంలో 42.8, 2017 మార్చి 31న ఆదిలాబాద్‌ జిల్లాలో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతం మార్చిలోనే ఎండవేడిమి 43 డిగ్రీలకు చేరడంతో ఇక ఏప్రిల్‌, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. మంగళవారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో సాధారణంకన్నా 3 డిగ్రీల వరకూ అధికంగా ఉష్ణోగ్రత పెరిగే సూచనలున్నాయని, ప్రజలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించింది. విదర్భ నుంచి కేరళ వరకూ గాలులతో ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతున్నందున ఎండల వేడి పెరిగిందని తెలిపింది. ఎండవేడి కారణంగా నల్గొండ ప్రాంతంలో గాలిలో తేమ సాధారణంకన్నా 24 శాతం తక్కువై పొడి వాతావరణం ఏర్పడింది. ఎండ తీవ్రతతో ఉక్కపోతలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోర్లలో తక్కువ నీరున్న చోట ఎండుతున్న పంటలకు నీరందించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement