– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ
జమ్మూ, కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన కామెంట్స్ బ్లాస్ట్‌లా మారాయి. ది వైర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ప్రతిపక్ష పార్టీలు.. కార్యకర్తల నుండి అతిపెద్ద రియాక్షన్ వస్తోంది. ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ మాట్లాడుతూ.. 2019 ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సైనికులు మరణించారని, ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వ అసమర్థత, ప్రధాన ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణం అన్నారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. మాజీ గవర్నర్ చేసిన ఈ కామెంట్స్‌ని పునరుద్ఘాటించారు. తన అధికారిక ట్విట్టర్ ఫీడ్‌లో కాంగ్రెస్ పార్టీ మాలిక్ ఆరోపణలను రీట్వీట్లతో హోరెత్తిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన వ్యక్తిగత ఇమేజ్‌ను కాపాడుకోవడానికి మోదీ ఈ ఘటనను ఉపయోగించుకున్నట్టు వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రస్తావించారు.
కాగా, అత్యున్నత రాజ్యాంగ పదవులకు మోదీ ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి ఇలా వ్యాఖ్యానించారంటే అది బీజేపీ అవినీతిని రుజువు చేస్తోందని ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై సీబీఐ తనకు సమన్లు పంపిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అంశంలో ఎలాంటి పొంతన లేదని, ఆప్‌ను దెబ్బతీయడానికి బీజేపీ ఢిల్లీ లిక్కర్ కేసును ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఇక.. బీహార్ అధికార ఆర్జేడీ ఒక ట్వీట్‌లో మాలిక్ ఇంటర్వ్యూను ప్రస్తావిస్తూ.. ‘పుల్వామా దాడిలో నిజం’ బయటకు వస్తోందని వ్యాఖ్యానించింది.
”పుల్వామా దాడిలో నిజం బయటపడుతోంది. నకిలీ, జిమ్మిక్కులతో కూడిన సంఘీ జాతీయవాదుల అసలు సంగతి తెరపైకి వస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు పుల్వామా ఎందుకు జరిగిందో అందరికీ అర్థమవుతోంది’ అని పార్టీ ట్వీట్ చేసింది. ఇక.. శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘‘మాలిక్ పుల్వామా గురించి ఓ బ్లాస్ట్ లాంటి నిజాన్ని” బయటపెట్టారు. అయితే దాడి తర్వాత ఈ ప్రశ్నలను సంధించిన ప్రతిపక్ష నాయకులను అధికార బిజెపి వారు మౌనంగా ఉంచారు.. అని పేర్కొన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి మనోజ్ కాకా ట్విట్టర్‌లో మాజీ గవర్నర్ ఇంటర్వ్యూను షేర్ చేసుకుంటూ.. CRPF సైనికులు కోరినప్పుడు విమానాలు ఇవ్వలేదని సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణపై ప్రశ్నలు సంధించారు. “సీఆర్‌పీఎఫ్‌లోని వీర జవాన్లు విమానం కావాలని అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మన అమరవీరుల బలిదానాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ ట్వీట్ చేశారు.
ఆర్టికల్ 370 రద్దుతో సహా అనేక అంశాలను పర్యవేక్షించిన జమ్మూ, కాశ్మీర్ రాష్ట్ర చివరి గవర్నర్ సత్యపాల్ మాలిక్, గవర్నర్‌గా నివేదించినప్పుడు “తుమ్ అభి చుప్ రహో” అని ప్రధాని మోదీ తనని ఇరుకున పెట్టారని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పుల్వామా మారణకాండకు కేంద్రం చేసిన తప్పులే కారణమని చెప్పారు. శుక్రవారం రాత్రి ‘ది వైర్’ న్యూస్ పోర్టల్ లో పోస్ట్ అయినా ఇంటర్వ్యూలో ప్రధానమంత్రికి ‘అవగాహన లేదు’.. ‘అవినీతిని పట్టించుకోవడం లేదు’ అని మాలిక్ అన్నారు. ఇక.. ఫిబ్రవరి 2019లో పుల్వామాలో CRPF కాన్వాయ్‌పై బాంబు దాడి చేసి 40 మంది జవాన్ల ప్రాణాలను బలిగొన్న విషయాన్ని మాలిక్ ప్రస్తావించారు. అప్పట్లో బిజెపి ఈ ఘటనను ఎన్నికల అంశంగా మార్చింది.