– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
చిన్నారులతో పోర్నోగ్రఫీ వీడియోలు చిత్రీకరించడం.. ఆ తర్వాత వాటిని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ఓ ముఠాని కేరళ పోలీసులు పట్టుకున్నారు. ఆన్లైన్లో పిల్లల అబ్యూస్డ్ వీడియోలు, ఇంటర్నెట్లో పిల్లల అశ్లీలతను అరికట్టడానికి చేపట్టిన ఆపరేషన్ P-హంట్ కింద కేరళ పోలీసుల CCSE (కౌంటరింగ్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్ ప్లోయిటేషన్) బృందం ఎనిమిది మందిని అరెస్టు చేసింది. ఈ మిషన్ ప్రధానంగా CSAM (పిల్లల లైంగిక దుర్వినియోగం) విక్రేతలపై దృష్టి సారించింది.
ఇక.. అరెస్టయిన వారిలో ఐటీ నిపుణులు కూడా ఉన్నారని కేరళ పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడిలో భాగంగా దాదాపు 212 డివైజెస్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67 బి కింద మొత్తం 133 కేసులు నమోదు చేశారు. గత నెలలో నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా 34 డివైజెస్‌ని సీజ్ చేసి 18 కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని నెలలుగా పిల్లల అశ్లీల కంటెంట్‌ను షేర్ చేసే సోషల్ మీడియా గ్రూపుల సంఖ్య బాగా పెరిగింది. నిందితులు ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను ఉపయోగించి ఫొటోలు, వీడియోలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వాటిని షేర్ చేసుకుని, డిలీట్ చేసేవారు. ప్రతి రెండు-మూడు రోజులకు ఒకసారి ఫోన్లను కూడా ఫార్మాట్ చేసేవారు. బాధితుల వెబ్‌క్యామ్‌లను హ్యాక్ చేయడానికి, పిల్లల డేటాని చోరీ చేయడానికి మాల్వేర్లను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇలా చేస్తున్న వారిని పట్టుకునేందుకు తాము కూడా ప్రత్యేక సాఫ్ట్ వేర్ని ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఇట్లా నిందితుల ఐపీ అడ్రస్‌లను గుర్తించామన్నారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అటువంటి ఫొటోలను పంచుకునే వ్యక్తులను గుర్తించడానికి లేటెస్ట్ పరికరాలను ఉపయోగించమాని, చిన్నారులపై జరిగే నేరాల పట్ల తాము జీరో టోలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. ఏదైనా పిల్లల అశ్లీల కంటెంట్‌ను చూడడం, షేర్ చేయడం, స్టోర్ చేయడం నేరంగా పరిగణిస్తామని, దీని ఫలితంగా గరిష్టంగా 5 ఏండ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా ఉంటుందని పోలీసులు వివరించారు.