ఏపీలో ఆపరేషన్ ముస్కాన్ ముమ్మరంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం పలువురి బాలల పట్ల సత్ఫలితాలను ఇస్తోంది. గత రెండు రోజులుగా ఈ కార్యక్రమం ద్వారా వివిధ చోట్ల పనిచేస్తున్న 6,697 మంది బాలలకు విముక్తి కలిగించినట్లు ఏపీ పోలీసులు వెల్లడించారు. కుటుంబ కారణాలతో చదువుకు దూరమై చిన్నా, చితకా పనులు చేసుకుంటున్న బాలలు, కుటుంబ ఆధరణ కరువై తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు ఈ కార్యక్రమం ద్వారా ఏపీ సర్కారు అభయహస్తం అందిస్తోంది. చదువుకోవాలనే తపన ఉన్నప్పటికి పరిస్ధితులు సహకరించని కారణంగా పనివాళ్లుగా మిగిలిపోతున్న చిన్నారులను చేరదీసి ఆశ్రయం కల్పిస్తోంది.
కాగా శుక్రవారం నాడు ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా విముక్తి కలిగిన 1,271 మంది బాలలకు కరోనా టెస్టులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించినట్లు వారు పేర్కొన్నారు.