పంజాబ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆపరేషన్ లోటస్ చేపట్టారని ఆప్ ఎమ్మెల్యే శీతల్ అనుగ్రాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై ఆరోపణలు చేయడంతో పంజాబ్‌లో రాజకీయ మంటలు చెలరేగాయి. హైకోర్టు న్యాయవాదులమని చెప్పుకునే ముగ్గురు వ్యక్తులు తనకు బీజేపీ తరపున 25 కోట్ల రూపాయలను ఆఫర్ చేశారని, అమిత్ షాతో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పారు. ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికే ఇదంతా చేశారని శీతల్ అనుగ్రాల్ ఆరోపించారు. తాను 10 నిమిషాల పాటు స్టింగ్ ఆపరేషన్ చేశానని, దానికి సంబంధించిన క్లిప్‌ను సాక్ష్యంగా విజిలెన్స్ విభాగానికి అందించినట్టు తెలిపారు.
తాను దేశ హోం మంత్రిని, సమాచార, ప్రసార శాఖ మంత్రి తీరును తప్పు పట్టడం లేదని, కానీ, తాను కలిసిన ముగ్గురు వ్యక్తులు వారి పేర్లు బయటపెట్టారన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వంపై వచ్చిన ఈ ఆరోపణలపై విచారణ జరపాలని శీతల్ అనుగ్రాల్ డిమాండ్ చేశారు. ఆప్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. పంజాబ్ మాజీ హోం మంత్రి సుఖ్‌జీందర్ సింగ్ రంధావా, ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపి) పర్తాప్ సింగ్ బజ్వా.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ వంటి పలువురు కాంగ్రెస్ నాయకులు అమిత్ షాపై కేసు నమోదు చేయడానికి ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ధైర్యం చెప్పారు.
మీట్ హేయర్, కుల్దీప్ సింగ్ ధాలివాల్‌తో సహా ఆప్ మంత్రులు కాంగ్రెస్‌ను బీజేపీకి బి టీమ్ అని ఆరోపించారు. ఓటింగ్ జరుగుతున్న ప్రత్యేక రోజున చాలా మంది సభ్యులు ఎందుకు బయటికి వచ్చారని ధాలివాల్ కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. ఆరోపణలపై స్పందించిన లోపి పర్తాప్ సింగ్ బజ్వా ఆరోపించిన ఆపరేషన్ లోటస్ మోసం తప్ప మరొకటి కాదని అన్నారు. ఆపరేషన్ కమలంపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు తగిన సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఈ ఆపరేషన్‌లో అమిత్ షా, అనురాగ్ ఠాకూర్‌తో సహా సీనియర్ బీజేపీ నేతల పేర్లు బయటికి వచ్చినట్లయితే, వారిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సామాన్య ప్రజల సమస్యలను ఆప్ ప్రభుత్వం విస్మరించిందని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా పంజాబ్ బీజేపీ నేతలు, అధ్యక్షుడు అశ్విని శర్మ నేతృత్వంలో ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చండీగఢ్‌లో రెండు గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఆరోపించిన ఆపరేషన్ లోటస్ నిరాధారమని, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని బీజేపీ నేతలు అభివర్ణించారు.