కేరళ రాష్ట్రంలో కొత్తగా ‘ఆపరేషన్ ఫోకస్’ డ్రైవ్‌ని ప్రారంభిచింది అక్కడి ప్రభుత్వం.. ఇదేదో డ్రగ్స్, దోపిడీ ముఠాల కోసం అయితే కాదు.. వాహనాల లైట్లను ఇష్టమున్నట్టు మార్చేయడం.. ఫ్లోరోసెంట్ ఎల్ఈడీ బల్బ్‌లు.. ఫ్లడ్ లైట్లను తలపించే వాటిని హై బీమ్‌లో ఉపయోగించడంపై అక్కడి సర్కారు ఫోకస్ చేస్తోంది. ఇట్లాంటి లైట్లతో ఎదురుగా వాహనదారులు కన్ఫ్యూజ్ అయిపోయి యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. అందుకని ఫ్లోరోసెంట్ లైట్లను ఉపయోగించడం, హైబీమ్‌ను డిమ్ చేయకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడే వాహన యజమానులు.. డ్రైవర్లను ట్రాక్ చేయడానికి కేరళలోని మోటారు వాహనాల విభాగం (MVD) సోమవారం నుంచి 10 రోజులపాటు రాష్ట్రవ్యాప్త డ్రైవ్ ‘ఆపరేషన్ ఫోకస్’ను ప్రారంభించింది.
మూడు రోజుల క్రితం గోవాలోని కన్నూర్ నుంచి వచ్చిన టూరిస్ట్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ డ్రైవ్ నిర్వహించారు. తదుపరి విచారణలో బస్సు ఆపరేటర్ అదనపు లైట్లను అమర్చడానికి అసలు విద్యుత్ వైరింగ్, ఫిట్టింగ్‌లను మార్చడం వల్ల మంటలు సంభవించినట్లు తేలింది.
ఆపరేషన్ ఫోకస్ ఏంటంటే..
మోటారు వాహనాల విభాగం ఏప్రిల్ 5వ, 8వ తేదీలు.. 12వ తేదీలలో రాత్రి 7 ఏడు గంటల నుంచి తెల్లవారు 3 గంటల వరకు ఈ తనిఖీలు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలో పార్కింగ్ లైట్లు లేకపోవడం, రిజిస్ట్రేషన్ గుర్తు, వెనుక నంబర్ ప్లేట్ వెలగకపోవడం, శబ్దం.. వాయు కాలుష్యం, అనధికారికంగా సెర్చ్ లైట్లను అమర్చడం వంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటారు. అంతేకాకుండా అదనపు లైట్ల ఉపయోగంపై కూడా చర్యలుంటాయి. దీంతోపాటు తనిఖీ తర్వాత కూడా పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
ఇక.. కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేటర్స్ అసోసియేషన్ (CCOA) అనధికార లైట్లు, ఫిట్టింగ్‌లను ఉపయోగించొద్దని ఇప్పటికే వారి సభ్యులను కోరింది. యువతను వాహనాల వైపు ఆకర్షించేలా లైట్లను ఎడాపెడా మార్చేస్తున్నారు. ఇలాంటి ధోరణులను మానుకోవాలని సీసీఓఏ ప్రధాన కార్యదర్శి ఎస్.ప్రశాంతన్ అన్నారు. ప్రమాదాలకు ఫ్యాన్సీ లైట్లే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. వెలుగుతున్న లైట్లు వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని గుర్తించిన మోటారు వాహనాల డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యింది.