Sunday, November 17, 2024

ఫీజుల బాదుడికి తెరతీస్తున్నారు! గత రెండేళ్లల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేలా పెంచనున్న‌ ఫీజులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాబోయే కొత్త విద్యా సంవత్సరానికి ఫీజులు బాదేందుకు ఒకవైపు పాఠశాలలు, మరోవైపు కళాశాలలు సన్నద్ధమవుతున్నాయి. గత రెండేళ్ల కాలంలో కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు పడుతున్నాయి. మార్చిలో జరిగిన మంత్రుల సబ్‌కమిటీ సమావేశంలో 10 శాతం లోపు స్కూల్‌ ఫీజులు పెంచుకునేందుకు తీర్మానించిన నేపథ్యంలో ఇదే అదునుగా చేసుకొని 2022-23 విద్యా సంవత్సరానికి అనధికారికంగా ఫీజులను ఖరారు చేసేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ ఫీజుల పెంపు విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో తమ ఇష్టానుసారంగా కార్పొరేట్‌ పాఠశాలలు ఫీజులను 10 నుంచి 30 శాతానికి పెంచేసే వసూలు చేసుకునేందుకు యోచిస్తున్నాయి. ఈ విధమైన ఫీజులను స్లాబ్‌ మార్పు పేరిట అమలు చేయబోతున్నట్లు తెలిసింది. కరోనా మిగిల్చిన నష్టం నుంచి ప్రజలు ఆర్థికంగా ఇంకా పూర్తిగా కోలుకోనేలేదు. ఎంతో మంది ఉద్యోగాలు ఊడి, వ్యాపారాలు నష్టాలుపాలై, జీతాల్లో కోత విధించిన పరిస్థితిని గత రెండేళ్ల కాలంలో ప్రజలు చవిచూశారు. ఇప్పుడిప్పుడే ప్రజలు ఆ కష్టాల నుంచి తేరుకుంటున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం మోపేందుకు కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు సన్నద్ధమవుతున్నాయి. కొత్త సంవత్సరానికి ఫీజులు పెంచుకొని అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతున్నాయి.

ఇంకా పదో తరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభమే కాలేదు. అవి పూర్తి కావాలి. ఆ తర్వాత 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగాల్సి ఉంది. ఆపై కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ షురూ కావాల్సి ఉంటుంది. ఇదంతా ఏమీ జరగకముందే అప్పడే పలు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు అడ్మిషన్ల వేటలో పడ్డాయి. క్యాన్వాసింగ్‌ను ప్రారంభించేశాయి. పాఠశాలలకు వచ్చే తల్లిదండ్రులను వచ్చే ఏడాది ఫీజు వివరాల గురించి సమాచారం ఇస్తున్నారు. పైగా ఇప్పుడే చెల్లిస్తే డిస్కౌంట్‌లు కూడా ఇస్తామని పెంచిన ఫీజులను తమపై రుద్దేస్తున్నారు.

ఫీజుల పెంపుపై నియంత్రణ జరిగేనా..?

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై ఒక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో గత జనవరిలో జరిగన కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రుల సబ్‌కమిటీ ఒకట్రెండు సార్లు భేటీ కూడా అయింది. ఫీజుల అంశంలో ఒక స్పష్టత ఇవ్వాలని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు సైతం ప్రభుత్వాన్ని కోరాయి. ఇప్పటికే తాము కరోనా కారణంగా తాము నష్టపోయామని, 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే చట్టం తేవాలని కోరాయి. కానీ అది ఏమాత్రం ముందుకు సాగలేదు. త్వరలో జూన్‌ లేదా జులైలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. ప్రైవేట్‌ పాఠశాలలేమో అప్పుడే అడ్మిషన్ల ప్రక్రియను చేపడ్తున్నాయి. ఈక్రమంలో స్కూల్‌ ఫీజులు ఏ తరగతికి ఎంత శాతం పెంచుకోవచ్చు? అనే స్పష్టతను ఇంకెప్పుడు ఇస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలివ్వకపోవడంతో పలు ప్రైవేట్‌, కార్పొరెట్‌ విద్యా సంస్థలు తమ ఇష్టానుసారంగా ఫీజుల బాదుడికి తెరలేపాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బడ్జెట్‌ స్కూళ్లలో నామమాత్రంగానే ఫీజులు ఉన్నా కార్పొరేట్‌ స్కూళ్లల్లో మాత్రం ఒక తరగతి నుంచి ఇంకో తరగతి మారితే పది నుంచి 30 శాతం లోపు ఫీజులు పెంచేస్తున్నట్లు సమాచారం. నగర శివారులోని ఓ ప్రముఖ స్కూల్లో గత విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి ఫీజు రూ.60 వేల వరకు ఉండగా, ఇప్పుడది ఆరో తగరతికి 75వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement