తానొక్కడే ఏకంగా 33స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ . ఆ దేశంలో త్వరలో జరగబోయే జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒక్కడే పోటీ చేయనున్నారట. పాకిస్థాన్ తెహ్రీక్ – ఇ- ఇన్సాఫ్ (పీటీఐ) కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు ఆ పార్టీ వైస్ ఛైర్మన్ షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. ఉప ఎన్నికలు జరిగే మొత్తం 33 పార్లమెంటరీ స్థానాలన్నింటి నుంచి పీటీఐ తరఫున ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే పోటీ చేయనున్నట్లు ఖురేషీ తెలిపారు. దేశంలో ముందస్తు ఎన్నికలు డిమాండ్ చేస్తున్న ఇమ్రాన్ ఖాన్… ఆ దిశగా ప్రభత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీటీఐ పార్టీ వర్గాలు తెలిపాయి.పాకిస్థాన్‌లో 33 పార్లమెంటరీ స్థానాలకు మార్చి 16న ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఆయా స్థానాల్లో గతంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన వారే విజయం సాధించారు. గత సంవత్సరం ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో ఓటమితో పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఇమ్రాన్ ఆదేశాల మేరకు పార్టీ ఎంపీలంతా రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ 70 మంది రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. ఖాళీ అయిన స్థానాలకు సంబంధించి తొలుత 33 చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పంజాబ్ ప్రావిన్స్‌లో 12 స్థానాలు, సింధ్ ప్రావిన్స్‌లో 9, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో 8, ఇస్లామాబాద్ లో 3 స్థానాలు, బలూచిస్థాన్ ప్రావిన్స్ లో 1 స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.