Thursday, November 21, 2024

Telangana: నాలుగు శాతమే ఫార్మసీ సీట్లు భ‌ర్తీ.. ఆసక్తి చూపని విద్యార్థులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఈసెట్‌ ద్వారా భర్తీ చేసే ఇంజనీరింగ్‌, బీఫార్మసీ సీట్లల్లో ఫార్మసీ సీట్లు చాలా వరకు మిగిలిపోయాయి. ఈనెల 17న చేపట్టిన మొదటి విడత సీట్ల కేటాయింపుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఆప్షన్‌గా కంప్యూటర్‌ సైన్స్‌, ఇతర అనుబంధ కోర్సులనే ఎంచుకున్నారు. దాంతో ఫార్మసీ సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీ కోర్సును ఎంచుకునేదుకు ఆసక్తి చూపలేదు. దాంతో కేవలం 4 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అయితే కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు 89 శాతం భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని 5 యూనివర్సిటీల్లో 106 బీఫార్మసీ సీట్లు ఉండగా అందులో 25 భర్తీ అయ్యాయి.

113 ప్రైవేట్‌ కాలేజీల్లో 1068 సీట్లకు 25(2.3 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. మొత్తం 118 కాలేజీల్లో బిఫార్మసీ (ఎంపీసీ స్ట్రీమ్‌) సీట్లు 1174 అందుబాటులో ఉంటే అందులో కేవలం 50 సీట్లు మాత్రమే అభ్యర్థులకు కేటాయించారు. అంటే కేవలం 4 శాతం సీట్లు భర్తీకాగా ఇంకా 1124 సీట్లు మిగిలిపోయాయి. ఈసెట్‌ ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్‌ సెకండియర్‌లో 89 శాతం మందికి సాంకేతిక విద్యాశాఖ సీట్లను కేటాయిస్తూ తొలిదశ సీట్ల ప్రక్రియను శనివారం పూర్తి చేసింది. ఈ విద్యా సంవత్సరం రెండో ఏడాదిలో ప్రవేవానికి మొత్తం 11,260 ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉంటే అందులో 9968 సీట్లు కేటాయించగా, 1292 సీట్లు మిగిలాయి.

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో 2643 సీట్లు ఉంటే 2470 సీట్లు నిండాయి. ఇంకా 173 సీట్లు మిగిలాయి. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌(ఏఐఎంఎల్‌) కోర్సులో 1043 సీట్లకు 736 సీట్లు భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో 2060 సీట్లకు 1853 సీట్లు కేటాయించారు. ఈఈఈలో 1096 సీట్లకు గానూ 1066 సీట్లు నిండాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌లోనూ 905 సీట్లకు 900 సీట్లు, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లోనూ 886 సీట్లల్లో 860 సీట్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌ 192 సీట్లల్లో 149 సీట్లను కేటాయించారు.

కంప్యూటర్స్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, మెకానికల్‌ కోర్సుల్లో 60 శాతం నుంచి 100 శాతం వరకు సీట్లు భర్తీ కాగా, బీ-ఫార్మసీ సీట్లు మాత్రం 4 శాతమే భర్తీ అయ్యాయి. ఈసెట్‌ ద్వారా భర్తీ చేస్తున్న ఈ బీఫార్మసీ సీట్లు ఎంపీసీ స్ట్రీమ్‌కు చెందిన విద్యార్థులే కౌన్సెలింగ్‌లో పాల్గొనడంతో నాలుగు శాతం భర్తీ అయి 96 శాతం సీట్లు మిగిలాయి. ఎంపీసీ విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకే ఇష్టపడతారు కానీ బీఫార్మసీలో చేరేందుకు సాధారణంగా ఇష్టపడరు. ఈక్రమంలోనే సీట్లు మిగిలినట్లు తెలుస్తోంది. అయితే సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 22లోగా ఆన్‌లైన్‌ చెల్లింపు ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని, వచ్చే నెల 10 లోగా అన్ని ధృవపత్రాలతో కాలేజీల్లో నేరుగా రిపోర్ట్‌ చేయాలని అధికారులు సూచించారు. మిగిలిన అన్నీ సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement