– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
దేశ రాజధానిలో జరిగిన విలేకరుల సమావేశంలో రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ సభ్యురాలు జయ వర్మ సిన్హా మాట్లాడారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం సిగ్నలింగ్‌లో కొంత సమస్య ఉంది. మేము ఇంకా రైల్వే సేఫ్టీ కమిషనర్ నుండి వివరణాత్మక నివేదిక కోసం ఎదురు చూస్తున్నాము. కేవలం కోరమండల్ ఎక్స్ ప్రెస్ మాత్రమే ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో రైలు దాదాపు గంటకు 128 కి.మీ వేగంతో ఉంది. అందుకే ప్రమాద తీవ్రత కూడా ఎక్కువే ఉందని సిన్హా తెలిపారు. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలు ఇనుప ఖనిజాలను తీసుకువెళుతున్నందున పట్టాలు తప్పలేదని.. ఓన్లీ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కే పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఆమె చెప్పారు.
గూడ్స్ రైలు పట్టాలు తప్పలేదని, ఆ రైలులో ఇనుప ఖనిజం ఉన్నందున దాని ప్రభావం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పై ఎక్కువగా ఉందన్నారు జయవర్మ సిన్హా. దీంతో పెద్ద సంఖ్యలో మరణాలు, బాధితులకు తీవ్ర గాయాలకు కారణం అయ్యిందని తెలిపారు. పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ చివరి రెండు బోగీలను ఢీకొన్నాయని వివరించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు డౌన్‌లైన్‌లో వచ్చి, డౌన్‌లైన్ నుండి గంటకు 126 కిమీ వేగంతో స్టేషన్ దాటుతున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ చివరి రెండు బోగీలను ఢీకొన్నాయని తెలిపారు.
ఇక.. బహనాగా స్టేషన్లో మరమ్మతు పనులు వేగంతంగా జరుగుతున్నాయని రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ సభ్యురాలు జయవర్మ సిన్హా చెప్పారు. కాగా, మృతుల సంఖ్య 288 కాదని, 275 అని తెలిపారు. మృతదేహాలను తనిఖీ చేయగా కొన్నింటిని రెండుసార్లు లెక్కించినట్లు ఒడిశా చీఫ్ సెసీ ప్రదీప్ జెనా స్పష్టం చేశారు. గాయపడిన 1,175 మందిలో 793 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంఖ్య మధ్యాహ్నం 2 గంటలకు అప్‌డేట్ చేసినట్టు వెల్లడించారు.