హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రండి బాబూ.. రండి. కిలో ఉల్లి రూపాయికే.. అని రోడ్ల పక్కన ఆటోలు ట్రక్కులు నిలబెట్టి అమ్ముకోవాల్సిన దుస్థితి రైతాంగాన్ని వెంటాడు తోంది. దూర ప్రాంతాల్లోని వ్యవసాయ మార్కెట్లకు తీసుకు వెళితే, ట్రాన్స్‌పోర్టు వ్యయం, ప్రయాణ ఖర్చులు కూడా రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నో వ్యయ, ప్రాయాసలకు ఓర్చుకుని పండించిన పంట కుల్లిపోతుంటే చూసి భరించలేక రూపాయికే కిలో అంటూ.. అమ్ముకుంటూ సంతృప్తి చెందుతున్నారు. వరంగల్, కరీంనగర్ నగరాలకు చుట్టుపక్కనున్న గ్రామాల్లో ఉల్లి రైతులు ఈ విధంగా కారుచౌక ధరలకు అమ్ముకుంటున్న సంఘటనలు బుధవా రం కినిపించాయి.. చూసిన ప్రతి ఒక్కరినీ అయ్యో.. పాపం అని కలవరపెట్టాయి. మార్కెట్లో ఉల్లికి కనీస ధరలు కూడా లేకపోవడంతో వరంగల్ మార్కెట్‌కు తీసుకువెళ్ళాలని బయలుదేరిన ఓ రైతు, కొత్తగట్టు వద్ద ట్రక్కును ఆపి కిలో రూపాయి చొప్పున అమ్మేసి వెళ్ళిపోయారు. ఉల్లి బస్తాలనన్నీ 50 కిలోల బరువుతో ఉండడంతో విడగొట్టి ఇవ్వకుండా రూ.50కి బస్తా చొప్పున అమ్ముకున్నాడు. ఒకవైపు ఆ రైతుల పట్ల స్థానికులు జాలి చూపిస్తూనే.. తక్కువ ధరకు వస్తుం డడంతో కేవలం అరగంటలోనే సరుకంతా కాజేశారు.
మిగిలేది కన్నీళ్ళే..
ఉల్లి రైతుకు కన్నీళ్లే మిగులుతున్నాయి. నాలుగు నెలలు పాటు కష్టపడి, ఖర్చుపెట్టి పండించిన పంటకు.. పెట్టు-బడి మాట అటు-ంచితే కనీసం పంట తీసేందుకయ్యే కూలి డబ్బులు కూడా రావడం లేదు. దీంతో రైతులు తల్లడిల్లుతున్నారు. దీంతో కొందరు రైతులు పొలంలోనే పంటను వదిలేస్తుండగా, మరికొందరు చేతికొచ్చిన పంటను తీయకుండానే దున్నేస్తున్నారు. అయితే మార్కెట్‌లో ప్రస్తుతం ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.500 నుంచి 600 వరకు మాత్రమే పలుకుతోంది. పొలం నుంచి క్వింటాల్ ఉల్లి తీసేందుకు కూలీకి రూ.400 చొప్పున నలుగురికి మొత్తం 1,600.. మార్కెట్‌కు తరలించేందుకు కనీస వాహన కిరాయి రూ.500 పోగా.. వారికి తీవ్ర నష్టం జరుగుతోంది. దీంతో చేతికొచ్చిన పంటను తీయకుండా కొంతమంది రైతులు వదిలేస్తున్నారు. మరికొందరు రైతులు ధర పెరుగుతుందేమోనన్న ఆశతో పొలాల నుంచి ఉల్లి పంటను తీసి చెట్ల కిందే నిల్వ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్లుగా మార్కెట్‌లో ఉల్లి పంటకు మంచి ధర లభించగా ఈ ఏడాది కూడా అదే ధర లభిస్తుందనే ఆశతో ఉల్లి పంట సాగు చేస్తే తమకు నష్టాలే మిగిలాయని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు- ఉల్లి పంటను ఎక్కువగా సాగు చేసే మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉల్లి రైతులు అక్కడ నిరసనలు చేస్తున్నారు.
బహిరంగ మార్కెట్లో మాత్రం – రూ.100కు 6కిలోలు..
బహిరంగ మార్కెట్లలో ఉల్లి సైజును బట్టి రూ.100కు 6 నుంచి 8 కిలోల వరకు వ్యాపారులు అమ్ముతున్నారు. అదే వివిధ ఆన్‌లైన్ యాప్‌లలో కిలో రూ.22 వరకు ధర ఉంది. కాగా, మార్కెట్లో ప్రస్తుతం ఉల్లి పంటకు ఇప్పటికిప్పుడు అమ్ముకోకుండా పండిన పంటను నిల్వ చేసి రాబోయే రోజుల్లో అమ్ముకుంటే లాభం ఉంటు-ందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని రైతుల పంటను గిడ్డంగుల్లో నిల్వ చేసే అవకాశం కల్పిస్తే వారిని కొంతవరకు ఆదుకోవచ్చని సూచిస్తున్నారు.