హైదరాబాద్, ఆంధ్రప్రభ: దక్షిణ తెలంగాణ పర్యటకరంగానికి ముఖచిత్రంగా ఉన్న కోయిల్ సాగర్ నిర్మాణం ఓ అద్భుతం. నిజాం రాజుల ఇంజనీరింగ్ నైపుణ్యత నేటికి ఆదర్శంగా నిలిచింది. 1945లో ఏడవ నిజాంమీరం ఉస్మాన్ అలీఖాన్ రూ. 85 లక్షల వ్యయంతో సిమెంట్ ను ఉపయోగించకుండా డంగు సున్నంతో నిర్మించి చరిత్ర సృష్టించారు. అయితే క్రమేణ ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలిచినప్పటికీ కాల్వలను మరమ్మత్తుచేయకపోవడంతో ప్రాజెక్టు మినహా మిగతా కాలువలు పూడికతో నిండిపోయి. ప్రకతి అందాలకు నెలవుగా పర్యాటకులను ఆకట్టుకునే ఈ ప్రాజెక్టును సమైక్యపాలకుల నిర్లక్ష్యానికి శిథిలావస్థకు చేరుకోగా 2.25 టీఎంసీల సామర్ధ్యం ఉన్న ఈ ప్రాజెక్టు 12వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా ప్రస్తుతం 4 వేల ఎకరాలకే పరిమితమైంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో అమరచింత నియోజకవర్గంలో 12వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు కోయిల్ సాగర్ మధ్యతరహా ప్రాజెక్టును 1945 లోనిజాం రాజు నిర్మించారు. అనేక సంవత్సరాలు ఆయకట్టు ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టు కింద కేవలం 4వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. అలాగే సమైక్య పాలనలో ప్రాజెక్టు మరమ్మత్తులు చేపట్టక పోవడంతో పంటకాలువలు పూరుకుపోయి మట్టిదిబ్బలుగా మారాయి.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుపై దృష్టి సారించి సాగునీటి శాఖతో డీపీఆర్ సిద్ధం చేయించి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. 50వేల 250 ఎకరాలకు కోయిల్ సాగర్ ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని ప్రతిపాదించారు.
జూరాలనుంచి 118 మీటర్ల ఎత్తులో ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు రెండుదశల్లో నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఇటీవల ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసి సంబంధీత సంస్థలకు ఫిర్యాదు చేసినప్పటికీ కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా 3.90 టీఎంసీల నీటి హక్కును తెలంగాణ ప్రభుత్వం సాధించి ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెంచింది. ఈ ప్రాజెక్టుసామర్ధ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబరు 1658 ద్వారా రూ. 567కోట్ల 22లక్షల కు పరిపాలనా అనుమతులు ఇవ్వడంతోపాటుగా2వేల 908 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ట్రయల్ రన్ కూడా పూర్తి చేసింది. అయితే పనుల్లో మరింత వేగం పెంచేందుకు అంచెనా వ్యవయం పెంచే అవకాశాలుకూడా ఉన్నాయి.
ప్రస్తుత ఖరీఫ్ పంటకాలానికి 35వేల 600 ఎకరాలు నీరు అందించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుత సంవత్సరం డిసెంబర్ నాటికి ప్రతిపాదిత 50వేల 250 ఎకరాలకు నీరు అందించేందుకు పనుల్లో వేగం పెంచారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ప్రభుత్వం తోలిదశలో ప్రాజెక్టుల మరమ్మత్తులు, సామర్ధ్యం పెంపు పనులు పూర్తిచేస్తూ కొత్తప్రాజెక్టులను సమాంతరంగా నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టులతో సమైక్యపాలనలో చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మలాంటి ఊరిచెరువులకు ఊపిరిపోసేందుకు సిద్ధమైంది. అలాగే ఇప్పటికే గొప్పపర్యాటక ప్రాంతంగా ఆకట్టుకుంటున్న కోయిల్ సాగర్ సామర్ధ్యం పెంపుతో ప్రాజెక్టు అందాలు మరింత కనువిందు చేయనున్నాయి.