Tuesday, November 26, 2024

One Nation – One Election – లోక్ సభతో పాటు 15 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు …

కేంద్రం మినీ జమిలీ ఎన్నికల దిశగా కసరత్తులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ పేరిట దేశవ్యాప్తంగా ఒకేసారి దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికల నిర్వహణ ద్వారా వ్యయ ప్రయాసలు తగ్గుతాయని గతంలో కేంద్రం ప్రతిపాదించింది. ఇలా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల నిర్వహణకవసరమైన న్యాయపరమైన అంశాలపై కూడా సుదీర్ఘకాలం చర్చ జరిగింది. అయితే ఒకేసారి ఎన్నికల ఈ ప్రతిపాదనకు సానుకూలత వ్యక్తం కాలేదు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల జోరు పెరుగుతోంది. అసెంబ్లిdలకు, లోక్‌సభకు విడివిడిగా ఎన్నికలు జరిగిన సందర్భాల్లో వేర్వేరు ఫలితాలు వెలువడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ అంశాలకు ప్రాధాన్యత వహిస్తోంది. అసెంబ్లి ఎన్నికల్లో మాత్రం స్థానిక అంశాలు, సామాజిక సమీకరణాలకు విజయం చేకూరుతోంది. 2018 తెలంగాణ అసెంబ్లి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయఢంకా మ్రోగించింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల విషయానికొచ్చేసరికి అక్కడ టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా మంచి ఫలితాల్నే రాబట్టగలిగాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని తపిస్తున్న బీజేపీ కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో గతంతో పోలీస్తే సీట్లు తగ్గుతాయన్న అంచనాకొచ్చేసింది. ఆ మేరకు దక్షిణ, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల్లో బలాన్ని పుంజుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు పూర్తిస్థాయి జమిలీ ఎన్నికలు కాకుండా మినీ జమిలీ ఎన్నికలకు సిద్ధమౌతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

(న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)

2024 మేలో కొత్త లోక్‌సభ కొలువుదీరాలి. మార్చి చివరి నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలవ్వాలి. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివరిలోగా ఐదు రాష్ట్రాల అసెంబ్లిdలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే లోక్‌సభతో కలసి మరో ఐదు రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికలు జరపాలి. ఆ వెనువెంటనే మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లిdలకు కాలపరిమితి పూర్తయి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. వీటితో పాటు గత ఐదేళ్ళుగా రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్‌లోనూ ఎన్నికలు పూర్తి చేయాలి. ఇప్పటికే ఇక్కడ అసెంబ్లిd నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ఇలా వచ్చే ఏడాది చివరిలోగా మొత్తం 15 అసెంబ్లిdలకు ఎన్నికలు జరగాలి. అంటే దాదాపు దేశంలో సగం అసెంబ్లిలకు 2024 చివరిలోగా ఎన్నికలు పూర్తవ్వాలి.

ఇందుకోసం ఐదు రాష్ట్రాల అసెంబ్లిల కాలపరిమితి ముగిసిన అనంతరం కూడా రెండు మూడు నెలల పాటు అక్కడ ఎన్నికలు వాయిదా వేయాలి. ఈలోగా రాష్ట్రపతి పాలన విధింపుపై ఇప్పటికే న్యాయపరమైన అధ్యయనాల్ని నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్‌లోగా మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరం ఎన్నికలు పూర్తికావాలి. డిసెంబర్‌ నాటికి రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లిdలకు కాలపరిమితి పూర్తవుతోంది. ఈ ఐదు రాష్ట్రాల్లో రెండు మూడు మాసాల పాటు తాత్కాలిక ఏర్పాట్లు చేసి లోక్‌సభ ఎన్నికల్ని రెండుమూడు మాసాల ముందుకు జరపాలన్నది కేంద్ర ప్రభుత్వ యోచనగా నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది మేలో జరగాల్సిన ఎన్నికల్ని ఫిబ్రవరి లేదా మార్చినాటికి ముందుకు జరిపేలా పథకరచన సాగుతోంది. ఈ ఏడాది చివరిలోగా కాలపరిమితి పూర్తయ్యే మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరం, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లిలకు కూడా లోక్‌సభతోపాటే ఎన్నికలు నిర్వహిస్తారు.
అలాగే వచ్చే మే నాటికి కాలపరిమితి పూర్తయ్యే ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికల్ని కూడా రెండుమూడు మాసాల ముందుకు జరిపి లోక్‌సభతో పాటే నిర్వహిస్తారు. లెక్కప్రకారం వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన హర్యానా, మహరాష్ట్ర, నవంబర్‌లో జరగాల్సిన జార్ఖండ్‌, 2025 ఫిబ్రవరిలో జరగాల్సిన ఢిల్లి అసెంబ్లిd ఎన్నికల్ని కూడా ఆరు నుంచి ఎనిమిది మాసాలు ముందుకు జరుపుతారు. వీటితో పాటు జమ్మూకాశ్మీర్‌కు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇలా ఒకేసారి దేశంలో సగానికి పైగా అసెంబ్లిdలకు లోక్‌సభతో కలిపి ఎన్నికలు నిర్వహిస్తే పూర్తిగా జాతీయ స్థాయి సమస్యలు, జాతీయ దృక్పథాలకు ప్రచారంలో పైచేయి అవుతుంది. ఇది బీజేపీకి లాభిస్తుందని ఆ పార్టీ అంచనాగా తెలుస్తోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ఎన్నికలకు ఆమోదం తెలిపినప్పటికీ మరికొన్నింటి నుంచి వ్యతిరేకత వెల్లడయ్యే అవకాశముంది. ముందుగా ఆయా అసెంబ్లిdల్ని రద్దు చేస్తూ మంత్రివర్గాలు తీర్మానం చేయాలి. ప్రస్తుతం ఈ ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలు కొలువుదీరాయి. ఇందులో నాలుగింట మూడొంతులు బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఈ పార్టీలతో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుని మినీ జమిలీ ఎన్నికల్ని నిర్వహించగలిగే అవకాశాలపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇవి సఫలమైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఒకట్రెండు మాసాలు ఆలస్యంగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లిdకొచ్చేసరికి రెండుమూడు మాసాల ముందుగానే ఎన్నికల కోయిల కూయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement