Friday, November 22, 2024

సంచలన ప్రకటన చేసిన మిజోరాం మంత్రి

ఫాదర్స్ డే నాడు మిజోరాం రాష్ట్రానికి చెందిన మంత్రి రాబర్ట్ రోమావియా ఓ వింత ప్రకటన చేశారు. ‘నా నియోజకవర్గంలో ఎక్కువ మంది పిల్లలను కన్న తల్లిదండ్రులకు లక్ష రూపాయల నగదు బహుమతిని ఇస్తాను. ఎక్కువ మంది పిల్లల్ని కనండి రూ. లక్ష గెలుచుకోండి’ అంటూ ఓ ఆఫర్‌ను ప్రకటించారు. దీంతో ఇది కాస్తా తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ వైపు జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వాలు కృషి చేస్తోంటే, ఏకంగా ఓ మంత్రి ఇలా మాట్లాడటం ఏంటని వార్తలు వచ్చాయి. ఆ డబ్బును ప్రభుత్వమే ఇస్తుందా.? అని కూడా నిలదీసినంత పనిచేశాయి. దీంతో ఈ విషయమై రాబర్ట్ స్పందించారు. ‘మిజోరాంలో ప్రజల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. మిజోరాం ప్రకృతి అందాలకు ప్రతీక. అలాంటి మిజోరాంను అభివృద్ధి చేయగలిగేంత స్థాయిలో మిజోల సంఖ్య లేదు. మిజోల లాంటి చిన్న చిన్న తెగల్లో జనాభా తగ్గిపోతోంది. అందుకే మిజోల సంఖ్యను పెంచేందుకు, ఆయా తెగల్లో ప్రజల సంఖ్యను పెంపొందించేందుకు నేను ఈ ప్రకటన చేశాను. ఇందుకోసం ప్రభుత్వం నుంచి డబ్బును వాడబోము. నా కుమారుడి కంపెనీ నుంచి వచ్చే లాభాలనే ఈ స్కీమ్‌ను వాడతాము’ అని రాబర్ట్ క్లారిటీ ఇచ్చారు. కాగా, ఎక్కువ మంది కనండి అని మంత్రి అన్నారే కానీ, గరిష్టంగా ఎంత మంది అని మాత్రం చెప్పకపోవడం గమనార్హం.

2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరాం జనాభా 10 లక్షల 91వేల 14 మంది మాత్రమే. 21,087 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మిజోరాం రాష్ట్రంలో ఒక చదరపు కిలోమీటరుకు 52 మంది జనాభా మాత్రమే నివసిస్తున్నారు. అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాల్లో అరుణా చల్ ప్రదేశ్ తర్వాత మిజోరాం రాష్ట్రమే ఉంది. కాగా, మిజోరాం పక్కనే ఉన్న అస్సాం మాత్రం ఇందుకు భిన్నమైన మార్గంలో వెళ్తోంది. జనాభా నియంత్రణకు కఠిన నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబాలకు మాత్రమే కొన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందుతాయంటూ ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. 2021 జనవరి నుంచి ఆ రాష్ట్రంలో కేవలం ఇద్దరు పిల్లలు లోపు ఉన్న వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement