Friday, November 22, 2024

మరోసారి మంచి మనసు చాటుకున్న కేటీఆర్‌.. ఆటో, డ‌బుల్ బెడ్రూం బ‌హూక‌ర‌ణ‌

నిరుపేద కుటుంబంలో జ‌న్మించి, తండ్రి బాధ్య‌త‌ల‌ను త‌న భుజాల‌పై వేసుకున్న ఓ యువ‌తికి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఇచ్చిన మాట ప్ర‌కారం మంత్రి కేటీఆర్ ఆ యువ‌తిని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పిలిపించి స‌త్క‌రించారు. ఆమె కోరిన‌ట్లు డ‌బుల్ బెడ్రూం ఇంటి ప‌త్రాల‌ను, ఆటోను అంద‌జేశారు. స‌బిత ఆలోచ‌నా విధానం, మాట తీరు త‌న‌ను ఎంతో ఆక‌ర్షించింద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. స‌బిత ఉన్న‌త చ‌దువుల‌కు త‌ప్ప‌కుండా స‌హాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి, న‌ల్ల‌గొండ జిల్లా కలెక్ట‌ర్‌కు స‌బిత ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

న‌ల్ల‌గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తికి చెందిన నామరమల్ల నర్సయ్య, రమణ దంపతుల ఒక్కగానొక్క కూతురు స‌బిత‌. మొదటి నుంచీ నిరుపేద కుటుంబం కావడంతో కుటుంబ పోషణ కోసం గ్రామంలోని హోటల్లో చేరి తన ఇంటిల్లిపాదితో పనికి కుదిరాడు నర్సయ్య. కాలక్రమేణా అనారోగ్యానికి గురికావడంతో 2015లో చ‌నిపోయాడు. దీంతో తల్లి రమణ తన కూతురును సాకుతూ అదే హోటల్లో పనిచేస్తూ కాలం వెల్లదీస్తున్నది.

సర్కారు స్కూళ్లల్లో చదువు.. ప‌దిలో ఫ‌స్ట్‌ ర్యాంకు..
సబిత వంగమర్తిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు కేతేపల్లి మండలం చెరుకుపల్లి కసూర్బాగాంధీ ఆశ్రమ పాఠశాలలో చదివి ప్రథమ ర్యాంక్‌తో రాణించింది. పై చదువుల కోసం నకిరేకల్‌ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేరింది. ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నది. కళాశాల ముగిశాక హోటల్‌లో అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆసరాగా నిలుస్తోంది.

సెకండ్‌ హ్యాండ్‌ ఆటో కొని..
రోజూ కళాశాలకు వెళ్లాలంటే రూ.100 ఖర్చవుతోంది. అదే ఆటో ఉంటే తన చార్జి పోను మిగిలిన పైస‌ల‌తో ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చన్న ఉపాయంతో హోటల్‌ యజమాని వెంకటేశాన్ని ఒప్పించి సబిత సెకండ్‌ హ్యాండ్‌ ఆటో కొనుగోలు చేసింది. అతని వద్దనే ఆటో తోలడం నేర్చుకుంది. 3 నెలలుగా వంగమర్తి -నకిరేకల్‌కు ప్రయాణికులను తీసుకెళ్తూ త‌ను కళాశాలకు వెళ్తున్నది. సాయంత్రం కాలేజీ ముగిశాక స్వగ్రామానికి చేరుకుంటుంది. ఈ క్రమంలో వచ్చిన డబ్బుతో ఇంటి అవసరాలు తీర్చుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement