వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్ర మంత్రులపై మరోసారి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ తిట్టిపోతారు.. మళ్లీ ప్రభుత్వ పథకాలు బాగున్నాయని రేపే అవార్డులు ఇస్తారని కేసీఆర్ అన్నారు. ఇక్కడున్న విద్యార్థులకు అన్ని విషయాలు తెలుసు.. ఈ నవీన సమాచార విప్లవం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ అద్భుతమైన జ్ఞానాన్ని సముపార్జిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల అండతో ఉద్యమం సాగించి, రాష్ట్రాన్ని సాధించామన్నారు.
అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. ఆరోగ్యం రంగంలో ఎన్నో అద్భుతాలు సాధించామని.. అయితే మరిన్ని విజయాలు సాధించాలన్నారు. 2014 కంటే ముందు ఐదు కాలేజీలు మాత్రమే ఉండే. కొత్తగా 12 కాలేజీలు మంజూరు చేశామన్నారు. మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్రం వివక్ష చూపించిందన్నారు. 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని.. త్వరలోనే అన్ని కాలేజీలు ప్రారంభమవుతాయని, హరీశ్‌రావు సారథ్యంలో ఇది సాధ్యమైందన్నారు. 2014కు ముందు 2800 మెడికల్ సీట్లు ఉండేవని, ఇప్పుడు 6500 మెడికల్ సీట్లున్నాయన్నారు. అన్ని మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే దాదాపు 10 వేలు కూడా దాటే అవకాశముందని కేసీఆర్ అన్నారు.