Friday, November 22, 2024

Big Story | ఒక వైపు చేరికల జోష్‌.. మరో వైపు అసమ్మతి రాగాలు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పార్టీలో రోజు రోజుకు చేరికల జోష్‌ కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీలోని అసంతృప్తులు హస్తం పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్లు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఈ నెలాఖరులోగా మొదటి జాబితా వస్తుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే స్క్రీనింగ్‌ కమిటీలో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మరోసారి స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమై.. అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. పార్టీ కోసం ముందు నుంచి పని చేసుకుంటూ వస్తున్న తమ పరిస్థితి ఏంటనే ప్రశ్న సొంత పార్టీ నాయకుల్లోనే ఉత్పన్నమవుతోంది. చేరికల స్పీడ్‌ ఎంత ఉందో.. అంతే స్థాయిలోనూ కాంగ్రెస్‌ నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో దాదాపుగా 30 నుంచి 40 నియోజక అసెంబ్లి నియోజకవర్గాల్లో కొత్త, పాత పంచాయతీ కొనసాగుతోంది.

రెండు నెలల క్రితం భువనగిరి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే మళ్లి అవకాశం వస్తుందని, కానీ అంతలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి గులాబీ గూటికి వెళ్లారు. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనువ్యూహంగా రెండు రోజుల క్రితం అనిల్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లడం.. కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెప్పకుండానే రేవంత్‌రెడ్డి అనిల్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లిన పార్టీలో కి చేర్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనిల్‌కుమార్‌రెడ్డి చేరికను వెంకట్‌రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వారిని ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన తుక్కుగూడ సభకు సొంత డబ్బును ఖర్చుపెట్టుకుని ప్రజలను తరలించామని, వచ్చే ఎన్నికల్లో పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న వారికే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేరికను కూడా మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో ఎవరిని చేర్చుకున్నా తమకేమి ఇబ్బంది లేదని, మల్కాజ్‌గిరి సీటు మాత్రం తనకే ఇవ్వాలని పార్టీ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు. మెదక్‌ సీటు కూడా మైనంపల్లికి ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఆ నియోజక వర్గం కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

- Advertisement -

నకిరెకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చేరికను కూడా స్థానిన నాయకులు వ్యతిరేకిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఒత్తిడులకు తట్టుకుని పార్టీని కాపాడుకుంటూ వస్తుంటే.. ఇప్పుడు ఎన్నికల ముందు కొత్తగా వచ్చి చేరితే తమ పరిస్థితి ఏంటని పీసీసీ ప్రధాన కార్యదర్శి, నకిరెకల్‌ టికెట్‌ ఆశావాహులు కొండెటి మల్లయ్యతో పాటు మరి కొందరు నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లోకి రావడంతో.. కొల్లాపూర్‌లో పార్టీ కోసం మొదటి నుంచి పని చేస్తున్న జగదీశ్వర్‌రావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్ట కాలంలో తాను సొంత డబ్బులను ఖర్చు చేసి కాంగ్రెస్‌ జెండాను కాపాడుకుంటూ వస్తే.. ఇప్పుడు కొత్తగా వచ్చిన జూపల్లికి టికెట్‌ ఇస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు.

నాగర్‌ కర్నూల్‌ నియోజక వర్గంలో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మొదటి నుంచి పార్టీలో పని చేసుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డి తనయుడు కాంగ్రెస్‌లో చేరి కాంగ్రెస్‌ టికెట్‌ రేసులో ముందు వరుసలో ఉన్నారు. దీంతో నాగం కలత చెందినట్లు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడుకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతి పోటీ చేసి ఓటమి చెందారు. వచ్చే ఎన్నికల్లో అమెకు టికెట్‌ రాకపోవచ్చని చెబుతున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒక వెళ రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తే.. ఆయనకు టికెట్‌ ఇస్తే ఒప్పుకునేది లేదని మునుగోడు కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు.

ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరుగుతుండటంతో.. అక్కడ మొదటి నుంచి పార్టీలో కీలకంగా పని చేస్తున్న సోమశేఖర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ప్రవీణ్‌రెడ్డిలు వ్యతిరేకిస్తున్నారు. తమలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా పర్వాలేదని , బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చే వారికి మాత్రం టికెట్‌ ఇస్తే సహకరించేది లేదని చెబుతున్నారు. నాయకుల మధ్య నెలకొన్న అసంతృప్తి, అసమ్మతులను తగ్గిస్తేనే.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని, లేదంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం పార్టీ కేడర్‌ను వెంటాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement