సిడ్నీ: ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుండగా, వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం ఫైజర్ గుడ్ న్యూస్ వినిపించింది. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ ను కట్టడి చేసే టీకాను కనిపెట్టామని వెల్లడించింది. మరో వంద రోజుల్లో దీన్ని అభివృద్ధి చేసి ప్రపంచ వ్యాప్తంగా డోస్ లను అందిస్తామని చెప్పింది. దక్షిణాఫ్రికాలో విపరీతంగా వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ శరవేగంగా ప్రపంచదేశాలను చుట్టుముట్టి భయభ్రాంతుల్ని చేస్తున్న విషయం విదితమే. కాగా, ఫైజర్ తాజా ప్రకటనతో అన్ని దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఒమిక్రాన్ ఇప్పటికే 50 కి పైగా వేరియంట్ లతో రక రకాలుగా విరుచుకుపడుతోంది.
ముఖ్యంగా బ్రిటన్, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం అతలాకుతలమవుతున్నాయి. ఆస్ట్రేలియాలోనూ ప్రభావం చూపుతోంది. తాజాగా సిడ్నీలో దిగిన యాత్రికుల్లో ఒమిక్రాన్ బయటపడింది. దీంతో భయాందోళనలు మొదలయ్యాయి. కాగా, రెండు వారాల్లొనే టీకాకు సంబంధించిన ఖచ్చితమైన ఫార్మాలాను తమ సైంటిస్టులు సాధించనున్నారని ఫైజర్ పేర్కొంది. మరోవైపు మరో వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం మొడెర్నా కూడా అతి త్వరలోనే తాము కుడా టీకాను కనిపెట్టి ఒమిక్రాన్ ను నిలువరిస్తామని ప్రకటించింది. బాగానే ఉంది కాని, అప్పటికి ‘పై’ వేరియంట్ (వైరస్ లను గ్రీక్ ఆల్ఫబెట్ సింబల్స్ ప్రకారం పిలుస్తున్నారు. ఒమిక్రాన్ తర్వాతి పేరు పై) రాదని ఏంటి గ్యారంటీ!,